– అధికారులు పటిష్ట సమన్వయంతో క్రియాశీలంగా పనిచేయాలి.
– విజయవాడ డివిజన్ పరిధిలో 45 కొనుగోలు కేంద్రాలు.
– ధాన్యం సేకరణ విధానంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి.
– విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలులో అధికారులు పటిష్ట సమన్వయంతో క్రియాశీలంగా పనిచేయాలని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య అన్నారు. శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్‌డీవో చైతన్య.. ఖరీఫ్ (2024-25) ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాలు, వ్యవసాయం, రెవెన్యూ, మార్కెటింగ్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. పంట కోతలు, ధాన్యం దిగుబడులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ, ధాన్యం రవాణా, మిల్లులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో మాట్లాడుతూ రైతుల క్షేమాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో (ఆర్ఎస్‌కే) ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని.. ఈ కేంద్రాలపై వీఏఏలు వంటి క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మద్దతు ధరలు, ధాన్యం నాణ్యతా ప్రమాణాల గురించి వివరించాలన్నారు. వివరాలతో కూడిన పోస్టర్లను కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. పంట కోతలపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్లు ప్రణాళికాయుత ఏర్పాట్లతో కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా పనిచేయాలన్నారు. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది అనేది లేకుండా సేవలందించాలన్నారు. ఒకవేళ ఆర్ఎస్‌కే ద్వారా కాకుండా ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మాలనుకుంటే రైతులు ఆ వివరాలను ఆర్ఎస్‌కేలో తప్పనిసరిగా నమోదు చేయాలని, ఇలాంటి రైతుల పేరుతో మరొకరు ధాన్యం విక్రయించకుండా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఈ వివరాలు దోహదం చేస్తాయన్నారు. ఈ విషయంపైనా సిబ్బంది ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికే పరిహారం అందించడం జరిగిందని.. అదే విధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు విజయవాడ డివిజన్ పరిధిలో 45 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలో 7, విజయవాడ రూరల్‌లో 15, మైలవరంలో 12, జి.కొండూరులో 10, విజయవాడ నార్త్ మండలంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కేంద్రాల్లో సిబ్బందితో పాటు ఎక్విప్‌మెంట్, గోనె సంచులు అన్నీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సాధారణ రకం (కామన్) క్వింటాకు రూ. 2,300, 75 కిలోలకు రూ. 1,725 అదేవిధంగా గ్రేడ్-ఎ రకం క్వింటాకు రూ. 2,320, 75 కిలోలకు రూ. 1,740 కనీస మద్దతు ధరగా ఉందని వివరించారు. షెడ్యూలింగ్ ప్రకారం గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని.. ప్రతి కేంద్రంలో రెండు చొప్పున హమాలీ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఒకవేళ రైతే గోనె సంచులుగానీ, హమాలీలుగానీ, రవాణాగానీ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆ సొమ్మును ధాన్యం సొమ్ముతో సహా రైతు ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు. మిల్లు సామర్థ్యానికి అనుగుణంగా ప్రణాళికతో ధాన్యాన్ని రవాణా చేయడం వల్ల అన్‌లోడింగ్‌లో జాప్యం జరక్కుండా చూడొచ్చన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము జమవుతుందని.. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కస్టోడియన్ అధికారులు, టెక్నికల్ సిబ్బంది.. ఇలా ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. రైతుల సహాయార్థం జిల్లాస్థాయిలో కంట్రోల్ రూం నంబరు (7702003571) అందుబాటులో ఉందని ఆర్‌డీవో తెలిపారు.
సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ తోట వెంకట సతీష్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఎంవీ ఇన్‌స్పెక్టర్ ఆర్.ప్రవీణ్‌తో పాటు తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, సహకార, మార్కెటింగ్ అధికారులు, వీఏఏలు తదితరులు పాల్గొన్నారు.