– క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ, పీఎన్‌డీటీ) చట్టం పటిష్టంగా అమలయ్యేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా పటిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అధ్యక్షతన లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ, సలహా కమిటీ సమావేశంతో పాటు ఏఆర్‌టీ, సరోగసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో చట్టం అమల్లో భాగంగా చేపడుతున్న పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు, డెకాయి ఆపరేషన్లపై సమీక్షించి, ఈ కార్యక్రమాలను పటిష్టంగా కొనసాగించాలని సూచించారు. సమావేశంలో జిల్లాలో కొత్తగా 4 స్కానింగ్ సెంటర్లు ఏర్పాటుచేసేందుకు అందిన దరఖాస్తులతో పాటు రెన్యువల్‌కు సంబంధించిన 5 దరఖాస్తులు, సవరణలకు సంబంధించిన 4 దరఖాస్తులు, పెనాల్టీకి సంబంధించిన 8 ప్రతిపాదనలను కమిటీ ఆమోదించింది. అదేవిధంగా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) లెవెల్-1కు సంబంధించి ఒకటి, లెవెల్-2కు సంబంధించి 6, ఏఆర్‌టీ బ్యాంక్‌కు సంబంధించి 2 దరఖాస్తులపై చర్చించి, ఆమోదించడం జరిగింది. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్టు డా. పద్మజ, ఎన్‌హెచ్ఎం డీపీఎంవో డా. నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News