-ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి జి సౌజన్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల హక్కుల పరిరక్షణలో యువత కీలక పాత్ర వహించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి సౌజన్య అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా 3 రోజు 16.11.2024 ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్,మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ, సంయుక్త ఫౌండేషన్ మరియు ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థల కలయికలో విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో బాలల హక్కుల పరిరక్షణలో యువత పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళ ఎస్ఐ సౌజన్య మాట్లాడుతూ యువత బాలల హక్కుల పట్ల బాలల చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని ఆపదలో ఉన్న బాలలను రక్షించడంలో యువత స్పందించాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు మనిషిని చిత్తు చేస్తుందని, పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని తెలిపారు. బాలలపై లైంగిక వేధింపులు దాడులు చేస్తే ఫోక్సో చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయని తెలుపుతూ పోక్సో చట్టంపై అవగాహన కలిగించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన లయోలా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ జి కిరణ్ కుమార్,SJ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు, మరియు హక్కుల పై చట్టాలపై అవగాహన చైతన్యం నింపటం చాలా అవసరమని ఈ దిశగా పనిచేస్తున్న ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ ను అభినందించారు. బడి బయట ఉన్న బాలలను గుర్తించటం, వీధి బాలలుగా, బాల కార్మికుల ఉన్న బాలలను రక్షించడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కౌన్సిలర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కలిగించారు. తెలిసో తెలియకో తప్పులు చేస్తూ జీవితాన్నే కోల్పోతున్నారని, తల్లిదండ్రులు సమాజంలో పెద్దలు ప్రతి ఒక్కరూ బాలలను గమనిస్తూ ఉండాలని తెలిపారు.
కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన ఫోరమ్ ఫర్ చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ బాల్యవివాహాలు లేని బాల కార్మికులు లేని బాలలపై హింస లేని సమాజాన్ని అందరి సహకారంతో నిర్మించవచ్చని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, దీనికి యువత ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. బాలలపై లైంగిక వేధింపులు శారీరక వేధింపులు ఉండకూడదని బాలలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహిస్తూ ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే పెద్దలకు, తల్లిదండ్రులకు గాని లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 గాని తెలియజేయాలని కోరారు.
బాలల హక్కులు – యువత పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించినందుకు నిర్వాహకులకు లయోలా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఫాదర్. G A P కిషోర్ SJ అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా కోటే ప్రకాష్, అరవ రమేష్ ఆలపించిన చైతన్య గీతాలు యువతలో ఉత్తేజాన్ని నింపాయి. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించడంతోపాటుగా బాలల హక్కులకై ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మానవ అక్రమ రవాణా(AHTU) విభాగపు సబ్ ఇన్స్పెక్టర్ కె.వి సుబ్బారావు, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రెటరీ కోటే.ప్రకాష్ కుమార్, కృపా ఫౌండేషన్ డైరెక్టర్శ్రీ రవీంద్ర, లయోలా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగపు అధిపతులు డాక్టర్ పి సురేష్, డాక్టర్ కే శేఖర్, ఆర్ జాన్, బాలల హక్కుల కార్యకర్తలు పెండ్యం విజయ్ కుమార్, పి సందీప్ కుమార్, సంయుక్త ఫౌండేషన్ ప్రతినిధులు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.