గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జీవితంలో ఉన్నత స్థానం, చదువులు పొందటానికి పేదరికం అడ్డంకి కాదని, కృషి, పట్టుదలతో సాధించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. ఆదివారం మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో జరుగుతున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కోచింగ్ సెంటర్ లో జరిగిన ఓరియంటేషన్ కార్యకమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాట్లాడుతూ తను కూడా చిన్న పల్లెటూరులో ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి ప్రభుత్వ స్కూల్లోనే చదివి అధ్యాపకుల సహాయ సహకారాలతో ఐఏఎస్ స్థాయికి వచ్చానన్నారు. ప్రతిభగల పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయటానికి అనేక సంస్థలు, వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని కాబట్టి పేదరికం ఉన్నత స్థానంకు అడ్డుకాదని ప్రతి ఒక్కరూ కష్టపడి, ఇష్టంతో చదివితే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక ప్రణాళిక ప్రకారం సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికి అనుగుణంగా కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో ఏమి కావాలో నిర్ణయం తీసుకొని దానిని ఒక వైట్ పేపర్ మీద రంగురంగులతో వ్రాసి విద్యార్థి ఎక్కువగా సమయం గడిపే ప్రదేశాల్లో దాన్ని అతికించి ప్రతిక్షణం దాని ద్వారా స్ఫూర్తి పొందాలని కోరారు. తాను గతంలో జిఎంసి అదనపు కమిషనర్ గా విధులు నిర్వహించిన సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ల్లో విద్యాపరంగా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో 250 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సులో ఉచితంగా సీట్లు లభించేటట్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వారికి కావాల్సిన బుక్స్ ఇతర అవసరాలు కూడా దాతల నుంచి సేకరించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా తనను నేరుగా సంప్రదించి తెలియజేయాలని ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని విద్యార్థులకు సూచించారు. మానవతా సంస్థ అందిస్తున్నశిక్షణను ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో నేర్చుకొని, మోడల్ టెస్ట్ పేపర్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి అత్యధిక మార్కులు సంపాదించి స్కాలర్షిప్ పొందాలని సూచించారు.
కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, కార్యాదర్శి కె.సతీష్, శివాజీ, ధనుంజయరెడ్డి, రాధాకృష్ణ, అరుణాచలం, రమణ, విజయలక్ష్మి, అధ్యాపకులు ప్రకాష్, మంగారావు, రెహమాన్, శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …