విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సృష్టిలో జగన్మాతను మించిన శక్తి రూపం మరొకటి లేదని, ఆ తల్లిని మించిన దయా స్వరూపిణి మరొకరు లేరని ప్రముఖ ప్రవచన కర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి, ఎస్ కే పి వి వి హిందూ హై స్కూల్స్ కమిటీ సంయుక్త నిర్వహణలో కొత్తపేటలోని కేబిఎన్ కళాశాలలో జరుగుతున్న శ్రీ కనకదుర్గానందలహరి ప్రవచన కార్యక్రమాలు ఆదివారం సుసంపన్నంగా ముగిశాయి. గరికిపాటి మాట్లాడుతూ సృష్టిలో సమస్త ప్రాణులను జగన్మాత తల్లిరూపంలో కాపాడుతోందని, పరమ భాగవతాదులకు ఇబ్బందులు కలిగినప్పుడు ఆమె అనేక రూపాల్లో వచ్చి రక్షించిందన్నారు. మంత్ర శక్తి పూర్తిగా వైజ్ఞానిక మైనదని చెబుతూ, మంత్ర తంత్ర యంత్రాలలో ఉన్న రహస్యాలను వివరించారు. విశాలాక్షి, కామాక్షి, కనకదుర్గ ఇలా ఎన్ని పేర్లుతో అవతారాలు దాల్చినా అవన్నీ లోక రక్షణ కోసమే అంటూ అనేక ఉదాహరణలతో వివరించారు. పురుషుడు ఎంత గొప్పవాడైనా భార్య లేనిదే పుణ్యం సంపాదించుకోలేడని, దాంపత్య జీవితంలో భార్యాభర్తలు శరీరాలు వేరే కానీ మనసులు ఒక్కటై ఉంటాయని చెప్పారు. తల్లి బిడ్డ నుంచి ఏమీ ఆశించకుండా ఎలా ప్రేమను పంచుతుందో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు కూడా భక్తులైన తన పిల్లలను ప్రేమిస్తుందని, అమ్మవారు మాతృమూర్తికి సమానమని చెప్పారు. జగన్మాతను ఆరాధించిన ఆదిశంకరాచార్యులు, భక్తపోతన, కాళిదాసు వంటి వారు రాసిన పద్యాలను వాటి అర్థాలను వివరించారు. ఇంద్రకీలాద్రి ఈవో కే ఎస్ రామారావు, కేబీఎన్ కాలేజీ సెక్రటరీ డాక్టర్ టి.శ్రీనివాస్, హిందూ హై స్కూల్స్ కమిటీ ప్రెసిడెంట్ టి.శేషయ్య, గోళ్ళ బాబా విజయ్ కుమార్ గరికిపాటిని ఘనంగా సత్కరించారు.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …