విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్య కారులు, ఆక్వా రైతులకు టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గించి స్థిరమైన లాభాలు పొందేవిధంగా అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నదని రాష్ట్ర మత్స్య శాఖ కమీషనర్ టి. డోలా శంకర్ అన్నారు. పోరంకి లోని మత్స్య శాఖ కమీషనర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డోలా శంకర్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా విజయవాడలో నిర్వహించనున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ నిర్వహించే ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ మత్స్య శాఖా మంత్రి కింజరపు అచ్చెం నాయుడు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర మారుమూలల నుండి మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్య పారిశ్రామికవేత్తలు, మహిళా మత్స్యకారిణిలు, మత్స్య సహకార సంఘ సభ్యులు మొత్తం 1000 మంది వరకూ హాజరు అవుతారని అయన తెలిపారు.
చిన్నతరహా మత్స్య పరిశ్రమలను గుర్తించి వాటి సుస్థిర అభివృద్ధికి సాంప్రదాయ చిన్నతరహా మత్స్యకారులు, మత్స్య కార్మికులు, రైతులను ప్రోత్సహించుట ద్వారా స్థానిక డిమాండ్ నకు అనుగుణంగా మత్స్య ఆహార ఉత్పత్తులను సరఫరా చేసి వారి జీవనోపాధిని మెరుగుపరుచుట ఈ సంవత్సరం నిర్వహించే ప్రపంచ మత్స్యకార దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని కమీషనర్ డోలా శంకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు, మత్స్య పరిశ్రమలకు రూ. 1-50 పైసలకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా అందిస్తున్నదని వీటిని చాలా తక్కువమంది ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇంటర్ నెట్, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుని చేపల చెరువుల్లో చేపలకు ఏ వ్యాధులు సంబవిస్తున్నదీ, చెరువుల్లో ఎన్ని చేపలున్నవీ అనేది గుర్తించ వచ్చునన్నారు. టెక్నాలజీని అనుసంధానం చేయుట ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి లాభాలను పొందవచ్చునన్నారు. తద్వారా వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు, ఆర్థిక రంగం అభివృద్ధికి కృషి చేసినవారలం అవుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ టెక్నాలజీని అందుబాటులోనికి తీసుకువస్తున్నదని ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు అభివృద్ధి సాధించాలన్నారు.
ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో మత్స్యకారులు, ఆక్వా రైతులు ఉత్పత్తి ఖర్చులను తగ్గించి స్థిరమైన లాభాలను పొందడానికి ఎటువంటి నూతన సాంకేతిక విధానాలు అవలంబించాలనేదానిపై 10 ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని కమీషనర్ డోలా శంకర్ అన్నారు. రాష్ట్రం లోని లక్షా 20 వేలమంది మత్య్సకారులకు రక్షణ మరియు భద్రతా కల్పించే ట్రాన్స్ ఫౌండర్ లు, రాష్ట్రం లోని 2 లక్షల 30 వేలమంది ఆక్వా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి వ్యాధులు తక్కువుగా వచ్చే బయో ఫ్లోప్ టెక్నాలజీ మరియు డ్రోన్స్ ద్వారా మేత మరియు మందులు చళ్లే విధానాలపై, నీటి నాణ్యత మరియు వ్యాధుల సమస్యలు, మేతల వినియోగం మొదలైన విషయాలను తెలిపే నూతన సాంకేతిక పరికరాలు, రొయ్యల చెరువుల్లో ప్రాణవాయు సాంద్రత తగ్గినపుడు వాటికంతట అవే తిరిగే ఎయిరేటర్ల టెక్నాలజీ, తక్కువ ఖర్చుతో చెత్త నుండి సంపద సృష్టించే బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాల పెంపకం మొదలుగునవి ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ లలో ప్రదర్శించుట ద్వారా మత్స్యకారులకు ఆక్వా రైతులకు అవగాహన కల్పించనున్నామన్నారు. ఇటువంటి టెక్నాలజీ ద్వారా చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి ప్రతీ ఏటా 15 శాతం వృద్ధి సాధించే విధంగా మత్స్య శాఖ ప్రణాళిక రూపొందించిందని మత్స్య శాఖా కమీషనర్ డోలా శంకర్ అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో మత్స్య శాఖా జేడీలు లాల్ మహ్మద్, వి. వెంకటేశ్వర రావు, డిడి పి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …