– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-60 వ వార్డు 266వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హతే ప్రామాణికం – ప్రతిఒక్కరికీ సంక్షేమం నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ – 266 వ వార్డు సచివాలయం పరిధి F-బ్లాక్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డివిజన్ ఇంఛార్జి బెవర నారాయణ, కోఆర్డినేటర్ బత్తుల దుర్గారావులతో కలిసి 210 గడపలను ఎమ్మెల్యే సందర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వానికి సంక్షేమం అనే పథానికి అర్థం కూడా తెలియదని విమర్శించారు. కానీ తాము గడప గడపకు వెళ్లి ప్రతి ఇంటికి అందించిన సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా అంకెలతో సహా వివరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇళ్లల్లోకి ఉన్న విద్యుత్ పోల్స్ ను తక్షణమే మార్చాలని సిబ్బందిని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా రెండు పూట్ల ఫాగింగ్, మందు పిచికారీ చేయాలన్నారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. అక్కడి విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని సిబ్బందికి సూచించారు.
మూడేళ్లలో రూ.11.36 కోట్ల అభివృద్ధి
60వ డివిజన్ లో గత మూడేళ్లలో రూ. 11.36 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. దాబాకొట్లు ఎక్సెల్ ప్లాంట్ రోడ్డు జంక్షన్ నుంచి వాంబే కాలనీ డిస్నీల్యాండ్ రోడ్డు వరకు నూతన రహదారి నిర్మాణానికి రూ. 3 కోట్ల నిధులు మంజూరు కాగా త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. B బ్లాక్ నందు నూతన వార్డు సచివాలయ భవన నిర్మాణాన్ని రూ. 70 లక్షల వ్యయంతో ప్రారంభించుకోగా.. పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. E, F & G బ్లాక్ ల నందు త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 26.36 లక్షల వ్యయంతో పవర్ బోర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు నాడు-నేడులో భాగంగా అంతర్గత రహదారుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు కంటే వైఎస్ జగనే ఎక్కువ రోడ్లు వేయించారు
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వేసిన రోడ్ల కంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలో అధిక రోడ్లు వేయించారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. రోడ్ల నిర్వహణపై ప్రతిపక్ష నేత ఆరోపణలను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర మంత్రులు రాజకీయ విమర్శలకు దిగుతూ ట్వీట్లు చేస్తుంటే.. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో కేంద్రాన్ని ప్రశ్నించవలసింది పోయి తిరిగి రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు దాడి చేయడం సిగ్గుచేటని మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన నాసిరకం పనుల వల్లే.. రాష్ట్రంలో రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిని ఇబ్బందికరంగా తయారయ్యాయన్నారు. పైగా రోడ్లు వేస్తామంటూ బ్యాంకుల నుంచి చంద్రబాబు రూ.3,800 కోట్లు అప్పు తీసుకు వచ్చి రోడ్లు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. టీడీపీ చేసిన తప్పిదాలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో.. రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు. అలాగే వర్షాల కారణంగా అక్కడక్కడ దెబ్బతింటున్న రోడ్లను సైతం వెనువెంటనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో..? మూడేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. రహదారులపై విమర్శలు గుప్పించే ముందు.. విజయవాడ-నూజివీడు రహదారిని టీడీపీ నేతలు ఓసారి పరిశీలించాలన్నారు. అంతేగానీ ఎల్లో మీడియా సహకారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. మరోవైపు విశాఖ ఘటనను పార్టీలకతీతంగా ఖండించవలసిందిపోయి.. మద్ధతు తెలిపే నీచ సంస్కృతికి టీడీపీ, బీజేపీ తెరదీశాయని మల్లాది విష్ణు విమర్శించారు. జనసైనికులు హింసను ప్రేరేపించే చర్యలకు పాల్పడితే.. సోమువీర్రాజు పవన్ కళ్యాణ్ కు పష్పగుచ్ఛం అందజేయడం దేనికి సంకేతమన్నారు. పైగా పోలీసులను తప్పుపడుతూ మాట్లాడటం ప్రతిపక్షాల దివాళకోరుతనానికి అద్దం పడుతోందన్నారు. విశాఖను ఆర్థిక రాజధాని చేయాలని గతంలో భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదా..? కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది మీరు కాదా..? అని నిలదీశారు. అమరావతి ఒక కుల రాజధాని అంటూ ఆనాడు విమర్శించిన బీజేపీ నాయకులు.. ఇప్పుడు నిస్సిగ్గుగా మాటలు మారుస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు చేస్తున్న విష ప్రచారాలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు ఇస్మాయిల్, కిరణ్, క్యాష్, కుమారి, ఫాతిమా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News