విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ శ్రీనివాసరెడ్డి తో కలిసి నందమూరి నగర్, భరతమాత కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీరు, అంతర్గత రోడ్ల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. త్రాగునీటి పైపులైన్ కనెక్టివిటీ చివరి గడపవరకు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావసరాల దృష్ట్యా డివిజన్ లో సిబ్బందిని పెంచాలన్నారు. పందులు, పాములు సంచరించకుండా, ఖాళీ స్థలాలను శుభ్రపరచాలని సూచించారు. వాలిపోయిన, సైడ్ కాల్వల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను సరిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా సకాలంలో నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. గత తెలుగుదేశం హయాంలో నిధులు కేటాయించకుండా కేవలం శిలాఫలకాలతో సరిపెట్టారని మండిపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే చాలావరకు స్థానిక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 58వ డివిజన్ లో రూ.8 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. భరతమాత కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. కోటి 90 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో అంచనాలను తయారు చేసినట్లు వెల్లడించారు. అప్పటివరకు అంతర్గత రోడ్లను టెంపరరీ రెస్టోరేషన్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అఫ్రోజ్, శర్మ, చంద్రశేఖర్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …