ఎన్నికల వ్యయాల పర్యవేక్షణలో పారదర్శకత పాటించాలి

– ఎన్నికల నిబంధనల అమల్లో నిర్లక్ష్యం వద్దు
– నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు
– ఎన్నిక‌ల జిల్లా వ్య‌య ప‌రిశీల‌కులు బి.విజ‌య్ కుమార్‌

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థ‌లకు సంబంధించి జిల్లా ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు బి.విజ‌య్ కుమార్ గురువారం తిరువూరులో ప‌ర్య‌టించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన స్టాటిక్ స‌ర్వైలెన్స్ (ఎస్ఎస్‌టీ) బృంద కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు.
త‌నిఖీల నిర్వహణ విధానం, సిబ్బంది విధుల నిర్వహణ, వాహనాల తనిఖీలు, అనుమానాస్పద నగదు, ఇతర వస్తువుల రవాణాను గుర్తించేందుకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం తిరువూరు మునిసిప‌ల్ కార్యాల‌యంతో పాటు ఎంపీడీవో కార్యాల‌యాల‌ను సంద‌ర్శించి వ్య‌య నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన విభాగాల ప‌నితీరును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువుల పంపిణీ జరగకుండా ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. ప్రధాన రహదారులు, ముఖ్యమైన కూడళ్లు, ఇతర అవసరమైన ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని తెలిపారు. తనిఖీల సందర్భంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, తనిఖీలకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయడంతోపాటు, అవసరమైన నివేదికలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. అనుమానాస్పద నగదు, వస్తువులు గుర్తించిన సందర్భాల్లో నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని, ప్రతి చర్యకు సంబంధించి పారదర్శకమైన రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా, తనిఖీల సమయంలో ప్రజలకు, వాహనదారులకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన సందర్భాల్లో చట్టపరమైన విధానాలను అనుసరించాలని తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల వ్యయాల పర్యవేక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయ్ కుమార్ పేర్కొన్నారు.