ఎస్‌ఎస్‌టీ బృందాల నిరంతర నిఘా

– స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు
– ఎన్నిక‌ల జిల్లా వ్య‌య ప‌రిశీల‌కులు బి.విజ‌య్ కుమార్‌

ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థ‌లకు సంబంధించి జిల్లా ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు బి.విజ‌య్ కుమార్ గురువారం కొండ‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన స్టాటిక్ స‌ర్వైలెన్స్ (ఎస్ఎస్‌టీ) బృంద కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు. అదేవిధంగా దొన‌బండ చెక్‌పోస్టును ప‌రిశీలించారు. కొండ‌ప‌ల్లి మునిసిప‌ల్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించి అక్క‌డ వ్య‌య ప‌రిశీల‌న బృందాల ప‌నితీరును అడిగితెలుసుకున్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాల నమోదు, ఖర్చులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ, వ్యయ వివరాల పరిశీలన, నివేదికల సమర్పణ తదితర అంశాలను ప‌రిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని పారదర్శకంగా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువుల పంపిణీ జరగకుండా ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాన రహదారులు, చెక్‌పోస్టులు, ముఖ్యమైన కూడళ్ల వద్ద నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని విజ‌య్‌కుమార్ స్పష్టం చేశారు.