పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

-36,351 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు
-డ్రోన్లు, సీసీటీవీలు, వీడియో చిత్రీకరణతో నిరంతర నిఘా
-సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో నవంబర్ 1న నిర్వహించనున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పోలింగ్‌కు పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపింది.

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

36,351 మంది పోలీసు సిబ్బంది మోహరింపు
ఎన్నికల భద్రత కోసం జిల్లాల్లో అందుబాటులో ఉన్న 32,276 మంది పోలీసు సిబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) నుంచి 2,730 మంది, ఇతర విభాగాల నుంచి 1,345 మందిని సమీకరించారు. వీరిలో 34 మంది ఎస్పీలు, 52 మంది అదనపు ఎస్పీలు, 152 మంది డీఎస్పీలు, 662 మంది సీఐలు, ఆర్‌ఐలు, 1,564 మంది ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు ఉన్నారు.

అలాగే 2,111 మంది ఏఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు, 4,505 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 17,017 మంది కానిస్టేబుళ్లు, 6,179 మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.

ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ
ఎన్నికల బందోబస్తులో భాగంగా 1,543 రూట్ మొబైల్ బృందాలు/యూనిట్లకు 3,103 మంది సిబ్బందిని కేటాయించారు. 481 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాల్లో 1,479 మంది, 347 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాల్లో 1,394 మంది విధులు నిర్వహించనున్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు 405 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి 415 మందిని నియమించారు. అదేవిధంగా 414 చెక్‌పోస్టులు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలకు 2,516 మందిని కేటాయించారు. రహదారుల పర్యవేక్షణకు 933 మందితో రోడ్ ఓపెనింగ్ పార్టీలు ఏర్పాటు చేశారు.

బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతకు 111 కేంద్రాల్లో 4,655 మందిని నియమించగా, పంపిణీ కేంద్రాల వద్ద 525 మంది సిబ్బందిని మోహరించారు. కమ్యూనికేషన్ విభాగంలో 500 మందితో పాటు ఇతర విధులు, షాడో పార్టీలు, పోలీసు ఉన్నతాధికారుల రిజర్వ్ బృందాలు, శాంతిభద్రతల పికెట్ల కోసం అదనపు సిబ్బందిని వినియోగించనున్నారు.

సున్నిత కేంద్రాలపై ప్రత్యేక నిఘా
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,372 పోలింగ్ స్టేషన్ లొకేషన్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వీటిలో అతి సున్నితమైన 671 కేంద్రాలకు 3,355 మంది పోలీసు సిబ్బందిని, సున్నితమైన 1,233 కేంద్రాలకు 4,943 మందిని కేటాయించారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా కొనసాగించనున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పోలింగ్ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించింది.

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరింది.

ప్రతి ఓటరూ నిర్భయంగా ఓటు వేసేలా అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.