-ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూనే నిబంధనల ప్రకారం సీజింగ్ చేపట్టాలి: వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్
-కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సమగ్ర సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు మరియు జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పోలీస్ మరియు సంబంధిత విభాగాల అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు నాగలక్ష్మి.ఎస్, వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్ పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర. హెచ్.ఎం, డిసిసి కె.జి.వి సరిత, జెడ్.పి. సిఇఓ పి.సుశీల, డిపిఓ టి.సీతామహాలక్ష్మి, ఆర్డీవో వెన్నెల శ్రీను, మున్సిపల్ కమిషనర్లు మరియు వివిధ విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
సాధారణ పరిశీలకులు నాగలక్ష్మి.ఎస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళిపై క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలి. సొంత నిర్ణయాలకు ఏమాత్రం తావులేకుండా ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, వ్యయ పర్యవేక్షణ, క్షేత్రస్థాయి ఫిర్యాదులపై నియమించిన బృందాలు తక్షణమే స్పందించాలి. ఫిర్యాదుదారులకు సరైన సమాచారం అందిస్తూ విశ్వసనీయతను కాపాడాలి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సరైన శిక్షణ అందించడంతో పాటు పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో వారికి రవాణా, నాణ్యమైన భోజనం, వసతి వంటి సౌకర్యాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫెసిలిటేషన్ కేంద్రాల నిర్వహణ మరియు బ్యాలెట్ పత్రాల ముద్రణను నిర్దేశిత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలి.
వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్ మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్స్ (FST), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SST) వాహనాల తనిఖీలు నిర్వహించే సమయంలో సాధారణ ప్రజలతో ఎంతో మర్యాదపూర్వకంగా, సంయమనంతో వ్యవహరించాలి. ఎక్కడైనా అక్రమాలు, నగదు, వస్తువులు పట్టుబడితే నిబంధనలకు అనుగుణంగానే పక్కా ఆధారాలతో సీజింగ్ చర్యలు చేపట్టాలి. నామినేషన్ల స్వీకరణ, ప్రచార నియమాలు, పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించాలి.
ఎన్నికల ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మరియు పరిశీలకులు అధికారులను ఆదేశించారు.
