72వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా… : ఒగ్గు సుజాత

-ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ పోరాటం : ఒగ్గు గవాస్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 72వ డివిజన్‌లో స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఒగ్గు సుజాత తెలిపారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం డివిజన్ పరిధిలో ఆమె విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డివిజన్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు మెరుగైన తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. 72వ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం : ఒగ్గు గవాస్కర్

ఈ సందర్భంగా సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తోందని తెలిపారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రైతులకు గిట్టుబాటు ధర, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. బియ్యం, వంటనూనె, పంచదార, పాలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదల కూడా ప్రజలపై అదనపు భారంగా మారిందన్నారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, పేదలు, భర్తను కోల్పోయిన మహిళల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, అర్హులైన వారందరికీ సకాలంలో పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితో పాటు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.