విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లోని విద్యావిధానంలో సమూల మార్పులకు నాంది పలికినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని, అందులో భాగంగా నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్ధులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ అధ్వర్యంలో జగనన్న విద్యాకానుక రెండో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం కొత్తపేట తేలప్రోలు రాజా హై స్కూల్ వద్ద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ లను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో “జగనన్న విద్యాకానుక” పథకం ద్వారా విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను కిట్ల రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు అనేక సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
తల్లిదండ్రుల్లో ఆనందం : మేయర్
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం జగనన్న ప్రభుత్వం చేపట్టిందని, విద్యాకానుక ద్వారా ఇస్తున్న వస్తువులను చూసి తల్లిదండ్రులు ఆశ్యర్యపోతున్నారని. ప్రైవేట్ స్కూల్‌లో ఫీజులు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, షూ, సాక్సులు కోసం ఇన్నేళ్ల లో రూ.వేలల్లో ఖర్చు చేసేవారని, రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా అందిస్తున్న జగనన్న విద్యాకానుక తో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, ఉపాధ్యాయులు, నగర పాలక సంస్థ సిబ్బంది ఉన్నారు.