గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించండి…

– ప్రతి నెలా వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నాం…
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, ఆగస్టు 21:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కొడాలి నాని గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీవో ఏ వెంకటరమణ గ్రామ సచివాలయంలో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలను చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు, లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని, దరఖాస్తుదారులు ఆయా వివరాలను సరిచూసుకోవచ్చని ఎండీవో వెంకటరమణ తెలిపారు. కాగా గ్రామ సచివాలయం పరిధిలో ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలపై సచివాలయ ఉద్యోగులతో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నెలా వేర్వేరు పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. వీటికి సంబంధించిన అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. కొన్ని పథకాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణీత సమయాన్ని నిర్దేశించిందని చెప్పారు. ఈ పథకాల కోసం వచ్చిన దరఖాస్తులకు సరైన వెరిఫికేషన్ జరగాలన్నారు. పెన్షన్లు, బియ్యం కార్డులు, ఇంటి పట్టాలు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా వెరిఫికేషన్ పూర్తిచేసి అర్హులకు అందిస్తున్నామా, లేదా అనే విషయాలను సచివాలయ ఉద్యోగులు సరిచూసుకోవాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వారికి కూడా, అర్హులైతే ప్రభుత్వ పథకాలను అందించాల్సిందేనని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు. అనర్హులకు ప్రభుత్వ పథకాలను అందించే పరిస్థితి ఉండకూడదన్నారు. వెరిఫికేషన్ తర్వాత అర్హులైనప్పటికీ ప్రభుత్వ పథకాలు అందకపోతే అందుకు సంబంధించిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికపుడు తనిఖీలు జరపాలని సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టం చేస్తున్నారని, అలా చేయడం వల్ల ప్రజలకు మరింత మంచి జరుగుతుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నానిని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, పంచాయతీరాజ్ డీఈ హరనాథ్ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ పోటూరి వెంకటేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ లు ఏలేటి అగస్టీన్, వెలిసేటి సరళ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, పర్నాస సర్పంచ్ గొర్ల రాజేష్, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, గ్రామ ప్రముఖుడు చెర్వు ప్రదీప్ శ్రీరామసాయి, వైసీపీ నేతలు పోటూరి శ్రీమన్నారాయణ, అద్దేపల్లి పురుషోత్తం, కఠారి రాంబాబు, బచ్చు మణికంఠ, కోట రాకేష్, కోట మహేష్, తాళ్ళూరి ప్రశాంత్, అద్దేపల్లి హరిహరప్రసాద్, జీ హర్ష, శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *