మరో తుపాను ముప్పు.. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి!

– భారీ వర్షాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో గ్రామస్థాయి వరకు జాగ్ర‌త్త‌లు
– క‌లెక్ట‌రేట్‌లో 91549 70454 నంబ‌రుతో క‌మాండ్ కంట్రోల్ కేంద్రం
– డివిజ‌న్లు, మండ‌ల‌స్థాయిలోనూ సీసీసీల ఏర్పాటు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మ‌రో తుపాను ముప్పు పొంచిఉంద‌ని, వ‌చ్చే రెండు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌న్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో జిల్లాస్థాయి నుంచి గ్రామ‌స్థాయి వ‌ర‌కు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. ఈ మేర‌కు ఆదివారం స్ప‌ష్ట‌మైన లిఖిత‌పూర్వ‌క ఆదేశాలిచ్చారు. రెవెన్యూ అధికారులు ప్రమాదకర భవనాలు, చెట్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పోలీస్ శాఖ శాంతిభద్రతలు, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే వైద్య శాఖ మొబైల్ ఆసుపత్రులు, మందులు త‌దిత‌రాల‌ను సిద్ధం చేయాలని, పౌర సరఫరాల శాఖ సహాయక శిబిరాలకు అవసరమైన ఆహార పదార్థాలను సమకూర్చాలని సూచించారు. విద్యుత్, రోడ్లు-భవనాలు, అగ్నిమాపక, నీటిపారుదల, పంచాయతీ రాజ్, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, ఐసీడీఎస్ తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉండి, ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
జిల్లా, డివిజ‌న్‌, మండ‌ల స్థాయిలో ప్ర‌త్యేక కంట్రోల్ రూమ్‌లు:
ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అదే విధంగా అధికారులు చేసే సూచ‌న‌లు పాటించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్ర‌త్యేక క‌మాండ్ కంట్రోల్ కేంద్రాల‌కు స‌మాచార‌మివ్వాల‌ని సూచించారు. ముందుజాగ్ర‌త్త‌గా విజ‌య‌వాడ డివిజ‌న్ (75690 08425), తిరువూరు డివిజ‌న్ (08673-251235), నందిగామ డివిజ‌న్ (78930 53534)తో పాటు అన్ని మండ‌లాల్లోనూ క‌మాండ్ కంట్రోల్ కేంద్రాల నంబ‌ర్లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. అదే విధంగా జిల్లా క‌లెక్ట‌రేట్‌లో 91549 70454 నంబ‌రుతో క‌మాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో వివిధ శాఖ‌ల అధికారులు అందుబాటులో ఉంటార‌న్నారు.