Breaking News

శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించండి…

-సగటు మనిషి అభివృద్ధి… తద్వారా రాష్ట్రాభివృద్ధే జనసేన లక్ష్యం…
-జిల్లాల్లో పర్యటనలు చేపట్టి పార్టీ సమీక్షలు నిర్వహిస్తా…
-జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజానీకం కష్టాలను, వారి నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా ఉండాలని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లి… కనీసం మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అప్పుడే శ్రమదానం ద్వారా మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారాన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చింది. శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా, మండల స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఆ పరిధిలో దెబ్బ తిని ఉన్న ఒక రోడ్డుకు మరమ్మతు చేయాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది మన పార్టీ లక్ష్యం. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదు. ఏ అంశాన్నైనా ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం. ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నాం. జిల్లాకు వెళ్ళినప్పుడే అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తాను” అన్నారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “పార్టీ శ్రేణులను జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకొంటూ మన అధ్యక్షుల వారి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించాలి. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను ప్రభావవంతంగా నిర్వహించాల”ని చెప్పారు. పార్టీ మండల, గ్రామ స్థాయి కమిటీల నియామకానికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
త్వరలో మండలాధ్యక్షులు, కమిటీల నియామకం…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్పిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలోకి నిలపాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  నిర్ణయించారని పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ప్రతి డివిజన్, వార్డుల్లో జనసేన అభ్యర్ధులను నిలబెట్టి వారి విజయం కోసం కృషి చేయాలని సూచించినట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాల అధ్యక్షులతో పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. ఉదయం 11గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమీక్షా సమావేశం కొనసాగింది. జిల్లాల అధ్యక్షులు ఇచ్చిన నివేదికలను సమీక్షించి పవన్ కళ్యాణ్  వారికి పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం కందుల దుర్గేష్, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, విజయవాడ నగర అధ్యక్షులు  పోతిన వెంకట మహేష్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిలతో కలసి సమావేశం వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా  దుర్గేష్ మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షుల వారితో జరిగిన సమీక్షా సమావేశంలో తొమ్మిది అంశాలపై తీర్మానం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులను నియమించిన జిల్లాల్లో నవంబర్ 15వ తేదీ నాటికి పార్టీ మండలాధ్యక్షులు, మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజులలో పూర్తి చేయాలని అధ్యక్షుల వారు ఆదేశించారు. త్వరలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. పర్యటనల్లో భాగంగా అధ్యక్షుల వారు ప్రతి జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తారు. అనంతరం కార్యాచరణకు రూపకల్పన చేస్తారు.
దీంతో పాటు జిల్లాలవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్, పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు 144 సెక్షన్, సెక్షన్ 30లు అమల్లో ఉండడం, చిన్నపాటి వినతిపత్రం ఇవ్వడానికి కూడా పోలీసులు అడ్డగించి, ఇబ్బందులుపెట్టడం వంటి అంశాలు, శాంతి భద్రతల అంశాలను పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చాం.
ప్రభుత్వ పథకాల అమలు వ్యవహారంలో ఫించన్లు…
ఆపివేయడం, రేషన్ కార్డులు ఎత్తివేయడం, అమ్మ ఒడి వాయిదా వేయడం లబ్దిదారులకు న్యాయంగా అందాల్సిన లబ్ది రాకపోవడం వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. జిల్లాల వారీగా ప్రత్యేకంగా ఉన్న సమస్యలపై జనసేన శ్రేణులు పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. స్థానిక సమస్యల మీద పోరాటం చేయాలని, రాష్ట్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేసి ఒక నోట్ తయారు చేసి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గానికి పంపాలని అధ్యక్షుల వారు సూచించారు. దీంతో పాటు పార్టీ క్రియాశీలక సభ్యులను బలోపేతం చేసే దిశగా వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం” అన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు  గాదె వెంకటేశ్వర రావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవింద రావు, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి  పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *