-జగన్ హయాంలో ఐదేళ్లలో కేవలం రూ.9,942.04 కోట్ల చెల్లింపులు
-ఆసుపత్రులకు రూ.2,221.60 కోట్ల బకాయిలు
-ఐదేళ్లలో కేవలం 41 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం
-కూటమి ప్రభుత్వంలో 7 నెలల్లోనే 7.61 లక్షల కుటుంబాలకు లబ్ధి
-మీడియా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని, పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అందించిన వైద్య సేవల్లోని వాస్తవాలు పరిశీలిస్తే జగన్ ద్వంద్వ వైఖరి, ఆయన చెప్పిన అబద్ధాలు ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. శుక్రవారం, వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, 2019-24 కాలంలో, ఆరోగ్యశ్రీ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం రూ.11,553 కోట్లని చెప్పారు. సగటున ఏడాదికి రూ.2,308.70 కోట్లు మాత్రమే మంజూరు చేశారని వివరించారు. జగన్ ఎన్నికల్లో ఓడిపోయి కుర్చీ దిగి వెళ్లిపోయే సమయానికి రూ.2,221.60 కోట్లను ఆసుపత్రులకు చెల్లించకుండా బకాయి పెట్టారని తెలిపారు. అంటే, ఒక సంవత్సరం పాటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
వాస్తవానికి, ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం గత ప్రభుత్వం ఆసుపత్రులకు చేసిన వాస్తవ చెల్లింపు రూ.9,942.04 కోట్లు మాత్రమేనని, సగటు చెల్లింపు సంవత్సరానికి రూ.1,988.41 కోట్లు మాత్రమేనని మంత్రి వివరించారు. ఆ ఐదేళ్లలో, జగన్ ప్రభుత్వం మూడేళ్ల పాటు సగటున సంవత్సరానికి రూ.1,255 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. జగన్ రెడ్డి హయాంలో పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సంపూర్ణంగా అందనలేదన్నదానికి ఈ లెక్కలే నిదర్శనమని చెప్పారు. ఎన్నికలకు కేవలం రెండు సంవత్సరాల ముందు మాత్రమే సంవత్సరానికి సగటున రూ.2,588 కోట్లను చెల్లించి, పేదల సంక్షేమ ప్రభుత్వమంటూ జబ్బలు చరుచుకున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ హయాంలోని ఐదేళ్లలో సంవత్సరానికి సగటున 7.60 కుటుంబాల చొప్పున, ఐదేళ్లలో మొత్తం 38 లక్షల కుటుంబాలు మాత్రమే ఆరోగ్యశ్రీ ప్రయోజనాలను పొందాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. లబ్ధిదార్ల పరంగా చూస్తే, సంవత్సరానికి సగటున 8 లక్షల మంది చొప్పున, ఐదేళ్లలో కేవలం 41 లక్షల మంది మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందారని వివరించారు. ఆరోగ్యశ్రీ అమల్లో జగన్ చూపిన అలసత్వానికి ఇంతకంటే రుజువు ఇంకేం ఉంటుందని సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య సేవలు పేదలందరికీ అందుబాటులోకి వచ్చాయన్న సత్యకుమార్ యాదవ్, కేవలం 7 నెలల పాలనలోనే 7.61 లక్షల కుటుంబాలు & 8.12 లక్షల మంది లబ్ధిదార్లు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్సలు పొందారని చెప్పారు. పేదల సంక్షేమం పట్ల గత ప్రభుత్వం – ప్రస్తుత ప్రభుత్వ నిబద్ధతలోని తేడాను ఈ లెక్కలే తేటతెల్లం చేస్తాయని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో, కొన్ని ఆసుపత్రుల్లో పదేపదే అక్రమాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. పేదల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఉచిత ఆరోగ్య సేవల పథకాన్ని కొన్ని ఆసుపత్రులు అక్రమంగా సొమ్ము చేసుకున్నాయని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడ్డ ఆసుపత్రులపై, గత ఐదేళ్ల కాలంలో కేవలం రూ.16.37 కోట్ల జరిమానా మాత్రమే విధించారని చెప్పారు. ఈ మొత్తంలో కనీసం 1 శాతం కూడా వసూలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, ఆసుపత్రుల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపామని చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, గత 7 నెలల కాలంలోనే మొత్తం రూ.22,83 కోట్ల జరిమానాలు విధించినట్లు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎంత బుకాయించినా అధికారిక లెక్కలు అబద్ధం చెప్పవని సత్యకుమార్ యాదవ్ అన్నారు. కాబట్టి, అబద్ధాలు చెప్పడం మానేయాలని జగన్‌కు హితవు పలికారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఎన్టీఆర్ వైద్య సేవ CEO డాక్టర్ మంజుల కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News