-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
-మంత్రి నిమ్మలతో కలిసి డంపింగ్ యార్డు పనుల పరిశీలన
పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మొదటి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోనే ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. రూ.5 కోట్లతో ఏర్పాటు చేసే ఈ సెంటర్ ప్రతి రోజూ 50 మెట్రిక్ టన్నుల వేస్ట్ ని ప్రాసెసింగ్ చేస్తుందని తెలిపారు. పాలకొల్లు పట్టణం 9వ వార్డు యడ్ల బజారు ప్రాంతంలోని, 12వ వార్డులోని సూర్యతేజ్ నగర్ లో జరుగుతున్న డంపింగ్ యార్డు పనులను మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి చైర్మన్ పట్టాభిరామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, పట్టణంలోని రెండు డంపింగ్ యార్డులలోని లెగసీ వేస్ట్ ని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ క్లియర్ చేస్తుందన్నారు. యడ్ల బజారు డంపింగ్ యార్డులో 25 వేల మెట్రిక్ టన్నులు, సూర్యతేజ్ నగర్ లో 57 వేల మెట్రిక్ టన్నులు ఉన్నట్లు గతంలో గుర్తించి, దానిని తొలగించడానికి వర్క్ ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు. అయితే, భూమి కింద పొరలలో కూడా దాదాపు 8 అడుగుల వరకు లెగసీ వేస్ట్ ఉన్నట్లు చెబుతున్నారని, రేపే ఒక టీమ్ ను పంపుతామని, వారు డ్రోన్ సర్వే ద్వారా అంచనా వేస్తారని చెప్పారు. భూమి లోపల ఎంత లెగసీ వేస్ట్ ఉన్నప్పటికీ, ఆ మొత్తాన్ని తొలగించడానికి వర్క్ ఆర్డర్ ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మంత్రి రామానాయుడు లాంటి ప్రజాప్రతినిధులు అరుదుగా కనిపిస్తారన్నారు. పాలకొల్లుని స్వచ్ఛంగా, ఆదర్శవంతమైన పట్టణంగా, రోల్ మోడల్ గా ఉంచేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన సారధ్యంలో రాష్ట్రాన్ని త్వరలోనే డంప్ యార్డు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పట్టాభిరామ్ ధీమాగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాలకొల్లు మున్సిపాల్టీ ప్రత్యేక అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారి దాసి రాజు, మున్సిపల్ కమిషనర్ బి.విజయసారధి, తహశీల్దార్ వై.దుర్గా కిషోర్, పబ్లిక్ హెల్త్ డీఈ ఆర్.విజయ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ కృష్ణమూర్తి, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News