Breaking News

నవంబరు 7వతేదీ నుండి పాపికొండలకు పర్యాటక బోటు విహారం ప్రారంభం…

-పర్యాటరంగం ప్రోత్సా హంతోపాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత
-కమాండ్ కంట్రోల్ కేంద్రాల్లో త్వరితగతిన సిబ్బంది సహా సౌకర్యాలు కల్పించాలి
-బోటు ఆపరేటర్లతో ప్రత్యేక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేయండి
-బోటుప్రయాణానికి రవాణా,భోజన వసతితో సహా టిక్కెట్ ధర 1250రూ.లు
-బోటు ఆపరేటర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్ఛితంగా పాటించాలి
-రాబోయే రోజుల్లో పోలవరంప్రాజెక్టు ప్రాంతాన్నిపర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దుతాం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతికశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నదిలో నవంబరు 7వతేదీ నుండి పర్యాటక బోటు విహార కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)వెల్లడించారు.బుధవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో బోటు ఆపరేటర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు.దేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్,కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటక రంగంతోనే బాగా అభివృద్ధి చెందాయని అదే తరహాలో రాష్ట్రాన్ని కూడా పర్యాటక పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.ముఖ్యంగా రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఒక ప్రముఖ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.గత ఏడాది గోదావరి నదిలో పాపికొండలు వద్ద జరిగిన బోటు ప్రమాదం అత్యంత దురదృష్టకరమైన సంఘటనని అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.ఆప్రమాదంపై ప్రభుత్వం వెంటనే జిఓ సంఖ్య 10 జారీ చేసి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు బోటు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు.దానిలో భాగంగానే గోదావరి,కృష్ణా నదుల పర్యాటక బోటుల నిర్వహణ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు.పోలీస్,రెవెన్యూ,నీటిపారుదల,పర్యాటక తదిర శాఖల అధికారులతో ఈకమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈకేంద్రాల్లో త్వరితగతిన సిబ్బంది సహా ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
బోటు ఆపరేటర్లతో వెంటనే ఒక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేయాలని దానివల్ల సకాలంలో వారికి సమాచారాన్ని అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాజమండ్రి నుండి పాపికొండల వరకూ పర్యాటక బోటు టిక్కెట్ ధరను రవాణా,భోజన వసతి సహా మనిషికి 1250రూ.లుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.బోటు ఆపరేటర్లు బోటులు నిర్వహణ ద్వారా వారి జీవనోపాధిని పొందడంతోపాటు పర్యాటకుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు.అదే విధంగా బోటుల నిర్వహణపై ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.నదిలో 28మీటర్ల లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే పర్యాటక బోట్లను అనుమతిస్తున్నారని దానిని 30 మీటర్ల వరకూ పెంచాలని నీటిపారుదల శాఖను కోరునున్నట్టు పేర్కొన్నారు.
ఈసమావేశంలో బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ పర్యాటక బోటు ఆపరేషన్లో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించి తమ జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని మంత్రికి విజ్ణప్తి చేశారు. దానిపై మంత్రి శ్రీనివాస్ స్పందించి ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనలేమీ లేవని వారికి స్పష్టం చేశారు.అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుండి కూడా పాపికొండలకు బోటు ఆపరేషన్ కు పరిశీలించాలని బోటు ఆపరేటర్లు మంత్రికి విజ్ణప్తి చేశారు.
ఈసమావేశంలో ఎపిటిడిసి ఎండి సత్యనారాయణ,ఆశాఖ సూపరింటిండింగ్ ఇంజనీర్ ఎఎల్ మల్ రెడ్డి,కృష్ణా గోదావరి నదుల పరిధికి సంబంధించిన బోటు ఆపరేటర్లు,నీటిపారుదల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *