మానవ హక్కుల కోసం పరితపించిన వ్యక్తి జస్టిస్ చంద్రయ్య : చీఫ్ జస్టిస్ లీసాగిల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మానవ హక్కుల కోసం పరితపించిన వ్యక్తి జస్టిస్ జి.చంద్రయ్య అని ఏపి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు.జస్టిస్ జి.చంద్రయ్య సంతాప సభ మంగళవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో నిర్వహించారు.ముందుగా జస్టిస్ చంద్రయ్య మృతికి సంతాప సూచకంగా ఫుల్ కోర్టు ఒక నిమిషం మౌనం పాటించి ఘన నివాళులు అర్పించింది.జస్టిస్ చంద్రయ్య కుటుంబ సభ్యులకు కోర్టు హాల్లో నిర్వహించే సంతాప సభ కార్యక్రమాన్ని వర్చువల్ గా పాల్గొనేలా అవకాశం కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ చంద్రయ్య తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్ లో జన్మించారన్నారు.నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ప్రాథమిక,హై స్కూల్ విద్యను తిమ్మాపూర్ తపాలపూర్ లో పూర్తిచేసి అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్,డిగ్రీ పూర్తి చేశారని అటుపై ఉస్మానియా యూనివర్సిటీలో లా కోర్సును అభ్యసించారని గుర్తు చేశారు.1980లో హై కోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయి ఉమ్మడి రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా రెండు పర్యాయాలు సేవలు అందించారని తెలిపారు.2005 లో ఉమ్మడి రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారన్నారు. పదవీ విరమణ అనంతరం తెలంగాణా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు తొలి ఛైర్మన్ గా ఐదు సంవత్సరాలు పనిచేశారని చెప్పారు.జస్టిస్ చంద్రయ్య నెల్సన్ మండేలా అవార్డుతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి మరో అవార్డు అందుకున్నారన్నారు.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జస్టిస్ చంద్రయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని తెలిపారు.జస్టిస్ చంద్రయ్య సామాజిక అసమానతలు,మానవ హక్కుల ఉల్లంఘనల వంటి అంశాలపై అనేక చారిత్రక తీర్పులు వెలువరించారని గుర్తు చేసుకున్నారు.

ఈకార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,ఏపి అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభునాథ్ జస్టిస్ చంద్రయ్య న్యాయ ప్రస్తానాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన బాట అందరికీ ఆదర్శనీమని కొనియాడారు.
ఇంకా ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,రిజిష్ట్రార్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ,ఏపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు బాలాజీ,బార్ కౌన్సిల్ ప్రతినిధులు,న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.