మోడల్ పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటింగ్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం రెండవ సాధారణ పురపాలక ఎన్నికలు–2026 నేపథ్యంలో వరలక్ష్మి నగర్‌లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని, పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న ఆంధ్రా లయోలా కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వరలక్ష్మి నగర్‌లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, పోలింగ్ కేంద్రంలో అనుసరించే విధానాలు ఏమిటి, ప్రిసైడింగ్ అధికారులు మరియు ఇతర పోలింగ్ సిబ్బంది నిర్వహించే విధులు ఏమిటి, బ్యాలెట్ పత్రంపై ఓటు ముద్రను ఎలా వేయాలి, అనంతరం బ్యాలెట్ బాక్స్‌లో ఎలా వేయాలి అనే అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఓటర్లు ఈ కేంద్రాలను సందర్శించి, ఓటు వేసే విధానంపై అవగాహన పొందాలని ఆయన కోరారు.

అనంతరం ఆంధ్రా లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించే విధానం, వాటిని భద్రపరిచే ప్రదేశాలు, ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేయాల్సిన టేబుళ్లు, కౌంటింగ్ రౌండ్ల నిర్వహణ, సిబ్బంది కేటాయింపు, విధుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, నిర్దేశించిన గడువులకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన సిబ్బంది, వారి విధుల కేటాయింపు, కూర్చునే ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపు నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.