-శనివారం ప్రపంచ మధుమేహ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ప్రత్యేక పరీక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ‘లక్షకు రక్షణ లక్ష్యం’ నినాదంతో శనివారం ఒకే రోజు కనీసం లక్ష మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి మధుమేహంతో పాటు ఇతర సాధారణ దీర్ఘకాలిక వ్యాధుల (ఎన్సీడీ) పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ముందుగా తమకు తాము పరీక్షలు చేయించుకుని, వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవల పరిధిలోని వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, జిల్లా స్థాయి అధికారులు ఈ పరీక్షల కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
