ఏపీలో భారీ పెట్టుబడులకు క్లీన్ మాక్స్ ఆసక్తి

-ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుల్లో రూ.36వేలకోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
-క్లీన్ మాక్స్ ఛైర్మన్ కుల్ దీప్ తో మంత్రి లోకేష్ భేటీ

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
క్లీన్ మాక్స్ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కుల్ దీప్ జైన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ తో చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులకు క్లీన్ మాక్స్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. రూ.36,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన, విద్యుత్ పంపిణీ, పంప్డ్ స్టోరేజ్, డేటా సెంటర్ పార్క్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. 4 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై రూ.28వేల కోట్లు (3 జీడబ్ల్యూ విండ్, 1 జీడబ్ల్యూ సోలార్), పునరుత్పాదక వనరులు సమృద్ధిగా ఉన్న టైర్-2 నగరంలో సొంత విద్యుత్ పంపిణీతో 1 జీడబ్ల్యూ (ఐటీ లోడ్) డేటా-సెంటర్ పార్క్ పై సుమారు రూ.2,000 కోట్లు, 1 జీడబ్ల్యూ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ఛైర్మన్ కుల్ దీప్ జైన్ వెల్లడించారు. తమ సంస్థ ఆధ్వర్యాన ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా, పరిగి మండలం, బీచిగానిపల్లె, పరిసర గ్రామాల్లో రూ.1,200 కోట్లతో 200 మెగావాట్ల సోలార్ పార్క్ భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో 2029 నాటికి 25 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్) సామర్థ్యానికి అనుగుణంగా క్లీన్ మాక్స్ విండ్-సోలార్ హైబ్రిడ్ లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్) ను అనుసంధానం చేయాలని కోరారు.