స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

-సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
-బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సుల భద్రతలో రాజీ పడొద్దు
-ఫిర్యాదులపై తక్షణ స్పందన.. నిష్పక్షపాత విచారణ తప్పనిసరి
-అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, పక్షపాత ధోరణికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా అనుకూల వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు.

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి శుక్రవారం సీడీఎంఏ డాక్టర్ పి. సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు కమిషనర్లు, డీఐజీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున, ఐజీ బి. రాజకుమారి పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు, రాజకీయ పార్టీల నుంచి అందుతున్న ఫిర్యాదులు, తదుపరి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.
ఫిర్యాదులపై తక్షణ స్పందన.. నిష్పక్షపాత విచారణ

ఎన్నికల ప్రారంభ దశలో ఏడు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందాయని కమిషనర్ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కల్పించడం, అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రతి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి సంబంధిత డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాత వైఖరి అత్యంత ముఖ్యమని, న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు ప్రజలకు స్పష్టంగా కనిపించాలి అని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులు న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయని, అభ్యంతరాలు ఉన్నవారు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం అధికారుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు.

తదుపరి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, తుపాను ప్రభావిత జిల్లాల్లోనూ ఎన్నికల సన్నద్ధత కొనసాగిస్తున్న అధికారులను అభినందించారు.
సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున మాట్లాడుతూ సున్నిత, అత్యంత సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అయితే ఓటర్ల గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌కు ఎదురుగా కెమెరాలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ నంబర్, ఓటర్ల సంఖ్య, మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో కూడిన సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. పోలింగ్, రీపోలింగ్, కౌంటింగ్ తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
పోలీసు బందోబస్తు ప్రణాళిక పక్కాగా అమలు

పోలీసు సిబ్బంది మోహరింపునకు ఇప్పటికే రూపొందించిన డిప్లాయ్‌మెంట్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేయాలని కార్యదర్శి ఆదేశించారు. సున్నిత, అత్యంత సున్నిత, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద స్టాటిక్, మొబైల్ పోలీసు బృందాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

పోలింగ్‌కు ముందు రోజు (P-1), పోలింగ్ రోజున పోలీసు, రెవెన్యూ, జోనల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలు ఉండకూడదు

ఎన్నికల ప్రక్రియలో ప్రతి బ్యాలెట్ పేపర్‌కు పూర్తి జవాబుదారీతనం ఉండాలని, ఒక్క బ్యాలెట్ పేపర్ కూడా గల్లంతు కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ ఏ. మల్లిఖార్జున ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల నుంచి రిసెప్షన్ కేంద్రాలకు, అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులను తరలించే ప్రతి దశలో నిర్దేశిత నిబంధనలు, ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని తెలిపారు.

బ్యాలెట్ బాక్సుల రవాణా, స్వీకరణ, భద్రపరిచే ప్రక్రియలో వీడియోగ్రఫీ, సీసీటీవీ పర్యవేక్షణ, అధికారుల సంతకాలు, రిజిస్టర్ల నిర్వహణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అప్పగించే సమయంలో వాటి సంఖ్య, తేదీ తదితర వివరాలతో లేఖ సిద్ధం చేసి రసీదు పొందాలని తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్‌లకు సుమారు 100 మీటర్ల దూరంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీసు, సివిల్ అధికారులను అందుబాటులో ఉంచాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో జరిగే కార్యకలాపాలను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు తగిన అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
48 గంటల నిశ్శబ్ద కాలం నిబంధనలు అమలు చేయాలి

పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలానికి సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కార్యదర్శి ఆదేశించారు. మద్యం విక్రయాల నిషేధం, ఎన్నికల ప్రచారంపై వర్తించే ఆంక్షలను ప్రజలకు, రాజకీయ పార్టీలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లు పత్రికా ప్రకటనల ద్వారా ఎన్నికల నిబంధనలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టణ స్థానిక సంస్థల పరిధిని విడిచివెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లు, కళ్యాణ మండపాల్లో పోలీసు తనిఖీలు నిర్వహించాలని, అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
రాత్రి 8 గంటల్లోగా కౌంటింగ్ పూర్తి చేయాలి

ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభించి, రాత్రి 8 గంటల్లోగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేయాలని డాక్టర్ మల్లిఖార్జున సూచించారు.

12 గంటల్లో కౌంటింగ్ పూర్తి చేసేందుకు అవసరమైన కౌంటింగ్ టేబుళ్లు, అదనపు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇవ్వాలని, కౌంటింగ్ హాళ్లలో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అర్హులైన ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని, పోలింగ్ ఏజెంట్ల క్రెడెన్షియల్స్ వెరిఫికేషన్ పేరుతో అనవసర జాప్యం చేయరాదని స్పష్టం చేశారు.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, తరలింపు, రిటర్నింగ్ అధికారులకు అప్పగించే విధానంపై స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
పోలింగ్ సామగ్రి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు

పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ఎన్నికల సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని, అదనపు సామగ్రిని రిజర్వులో ఉంచుకోవాలని కార్యదర్శి సూచించారు.

ముఖ్యంగా చెరగని సిరా (ఇండెలిబుల్ ఇంక్), స్వస్తిక్ స్టాంపులు, స్టాంప్ ప్యాడ్లు తదితర సామగ్రి తగినంత అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చిన్నపాటి లోపాలు కూడా ఓటర్లలో అసహనం, ఆందోళనకు కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బ్యాలెట్ పేపర్లపై ఉండే గుర్తులు, మార్కులు, స్వస్తిక్ ముద్రలకు సంబంధించి ఏవి చెల్లుబాటు అవుతాయి, ఏవి చెల్లవు అనే అంశాలపై ఎన్నికల అధికారులు, కౌంటింగ్ ఏజెంట్లకు ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించరాదని, మీడియా ప్రతినిధులు ఓటింగ్ గోప్యతకు భంగం కలిగించకుండా నిబంధనలు పాటించాలని తెలిపారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు కూడా పార్టీ గుర్తులు, కండువాలు లేకుండా నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించాలని స్పష్టం చేశారు.
వీడియోగ్రఫీ, డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ

ఎన్నికల నిర్వహణలో పటిష్టమైన పోలీసు భద్రతా చర్యలు చేపట్టాలని ఐజీ బి. రాజకుమారి పోలీసు అధికారులను ఆదేశించారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియోగ్రఫీ, డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలను వినియోగించాలని తెలిపారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే ప్రయత్నాలను గుర్తించి, సంబంధిత చర్యలను ఆధారాలతో సహా రికార్డు చేసేలా సాంకేతిక పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు.
బ్యాలెట్ బాక్సుల తరలింపునకు పటిష్ట భద్రత

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు, అక్కడి నుంచి కలెక్షన్ పాయింట్ల వరకు బ్యాలెట్ బాక్సులకు పూర్తి భద్రత కల్పించాలని ఐజీ ఆదేశించారు.

బ్యాలెట్ బాక్సుల తరలింపులో అనధికారిక విరామాలు, మధ్యంతర నిలుపుదలలు ఉండకూడదని స్పష్టం చేశారు. నిర్దేశిత మార్గంలోనే బ్యాలెట్ బాక్సులను తరలించేలా పోలీసు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్‌ను అవసరమైన ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా మోహరించాలని, ఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలోని ప్రత్యేక బలగాలను పరిస్థితులకు అనుగుణంగా వినియోగించాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిఘా

పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ముందుగానే సమగ్ర బ్రీఫింగ్ ఇవ్వాలని ఐజీ సూచించారు. పోలీసు సిబ్బంది తమంతట తాము పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించకుండా, ప్రిసైడింగ్ అధికారి పిలుపు లేదా అనుమతి మేరకే లోపలికి వెళ్లాలని స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పెద్ద గుంపులు ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని, నిర్దేశిత 100 మీటర్ల పరిధిలో ఎవరూ గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలింగ్ చివరి గంటలో ప్రత్యేక అప్రమత్తత

పోలింగ్ ముగింపునకు ముందు చివరి గంట అత్యంత కీలకమని ఐజీ బి. రాజకుమారి పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రాక్సీ ఓటింగ్, ఇతరుల పేరుతో ఓటు వేసే ప్రయత్నాలు (ఇంపర్సనేషన్) జరగకుండా పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనధికారిక వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా నిఘా ఏర్పాటు చేయాలని, అత్యవసర సమాచారం, ఫిర్యాదులు, పోలీసు సహాయం కోరే కాల్స్‌కు తక్షణమే స్పందించేందుకు జిల్లా ఎస్పీలు క్యూ టీమ్‌లను రిజర్వులో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, భద్రత, జవాబుదారీతనం పాటించాలని, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల నుంచి బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్, తుది ఫలితాల ప్రకటన వరకు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు స్పష్టం చేశారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.