రాష్ట్రానికి 6 జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణల సలహా, సూచనలతో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నాయకత్వంలో ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగుతున్న ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ ఉద్యమ ఫలితంగా రాష్ట్రానికి ఆరు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డులు లభించాయి. జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ లో మన రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్లకు, కుప్పం మున్సిపాల్టీకి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ప్రకటించింది. రాష్ట్రానికి ఆరు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డ్స్ దక్కడం ఎంతో గర్వకారణం అని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ ఉద్యమం ద్వారా రాష్ట్రంలో పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. ప్రజల భాగస్వామ్యం, మున్సిపల్ యంత్రాంగాల నిరంతర కృషితో జాతీయ స్థాయిలో ఈ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు లభించాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 11న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు ప్రధానం చేస్తారని తెలిపారు. ఈ అవార్డ్స్ సాధించడంలో ఎనలేని కృషి చేసిన శానిటరీ వర్కర్స్ కి ముందుగా తన హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. సహకరించిన వివిధ స్థాయిలలోని అధికారులకు , ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిద్దామని పట్టాభిరామ్ పిలుపు ఇచ్చారు.