గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత విజయవంతంగా ముగియడానికి అధికారులందరూ ఒక టీమ్‌లా, కుటుంబంలా కలిసికట్టుగా పనిచేయడమే ప్రధాన కారణమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. ఎన్నికల నిర్వహణ విజయంతంపై శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో అభినందన సభ జరిగింది.
ఈ సందర్భంగా తొలుత అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలో, తుఫాన్ వంటి విపత్కర పరిస్తితుల్లో కూడా అందరినీ సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడంలో కమిషనర్ కృషి ఆదర్శనీయమన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ, ప్రతికూల వాతావరణ సమయాల్లోనూ, వర్షాలు కురుస్తున్నప్పటికీ సిబ్బంది తమకిచ్చిన బాధ్యతలకంటే ఎక్కువ శ్రమించి పనిచేశారని కొనియాడారు. రాత్రింబవళ్లు కష్టపడి భారీ మెటీరియల్‌ను తరలించడంలో మలేరియా, పారిశుద్ధ్య సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు చూపిన అంకితభావం ఎంతో గొప్పదన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులకు తగిన శిక్షణ ఇవ్వడం, బస్సుల ఏర్పాట్లు, రూట్ ఆఫీసర్ల సమన్వయం వంటి అంశాలను చాలా పకడ్బందీగా అమలు చేశామన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలు జరగకుండా ముందస్తుగానే ప్రొయాక్టివ్‌గా అనుమతులు ఇవ్వడం వల్ల ఎలాంటి నోటీసులు, వివాదాలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల విజయం ఏ ఒక్కరిదో కాదని, ఇది పూర్తిగా సమిష్టి కృషితో సాధించిన విజయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే సానుకూల దృక్పథంతో గుంటూరు నగర ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తూ, నగరాన్ని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో టాప్ పొజిషన్‌కు తీసుకెళ్లేందుకు అందరూ మరింత అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అభినందన సభలో అదనపు కమిషనర్లు ఐ.కిషోర్, జి.రవీంద్ర, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఎలిషా, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, ఉపా సెల్ పిఓ సింహాచలం, మేనేజర్ బాలాజీబాష, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమిష్టి కృషితోనే జిఎంసి ఎన్నికలు దిగ్విజయం… : నగర కమిషనర్ మయూర్ అశోక్
