Breaking News

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్‌ ముస్తాబు


-45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం ఆరేళ్లలో నిర్మాణం
-216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం
-బరువు 1800 కిలోలు.. చైనాలో 1600 భాగాలుగా తయారీ
-గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’
-సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం
-2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు
-వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని.. సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో కార్యక్రమం
-5న మోదీ రాక.. మహావిగ్రహ ఆవిష్కరణ.. జాతికి అంకితం
-13న రాష్ట్రపతి రాక.. నిత్యపూజా మూర్తి విగ్రహానికి తొలిపూజ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పద్మపీఠంపై పద్మాసనంలో ఆసీనుడిగా త్రిదండ ధారుడై.. ముకుళిత హస్తాలతో దివ్య తేజస్సుతో కూడిన ఆయన మోమును చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది! అన్నీ ఒక్కటే.. అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు.

శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్‌ దివ్య క్షేత్రం ముస్తాబైంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు!

2016లో పనులు

శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి సంకల్పంతో ముచ్చింతల్‌ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.1000 కోట్లతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు పాల్గొన్నారు. ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. తొమ్మిది నెలల పాటు శ్రమించి..1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మనదేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులొచ్చి విగ్రహ రూపునిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకొని వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని పలు భాగాల కోణంలో చూస్తే.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మ పీఠం 27 అడుగులు, శ్రీరామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఈ సమతామూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు వేదికను సిద్ధం చేశారు. ఈ గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు.

వేర్వేరు రోజుల్లో రాష్ట్రపతి, ప్రధాని..

ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ముచ్చింతలకు విచ్చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సమతామూర్తి మహా విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. 13వ తేదీన రాష్ట్రపతి కోవింద్‌ వస్తారు. ప్రధానాలయంలోని నిత్యపూజామూర్తి బంగారు విగ్రహానికి తొలి పూజ చేయడం ద్వారా ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.

5 వేల మంది రుత్వికులతో..

శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు వస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగశాలల్లో 1035 హోమగుండాలను సిద్ధం చేశారు. హోమంలో రెండు లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తున్నారు. రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని దేశీయ ఆవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నెయ్యిని ఇందుకు వినియోగిస్తున్నారు. రుత్వికులు హోమాల్లో పారాయణాల్లో పాల్గొంటారు. పండితులు కోటి సార్లు అష్టాక్షరి మహా మంత్రాన్ని జపిస్తారు.

ప్రధానాకర్షణ ఫౌంటెయిన్‌!

సమతామూర్తి మహా విగ్రహం చుట్టూ శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్య క్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ఈ దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్‌ కనిపిస్తుంది. పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ.25 కోట్లతో ఫౌంటెయిన్‌ను నిర్మించారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *