క్యాన్సర్‌ మందుల ధరల తగ్గింపు ప్రయోజనం ప్రతి రోగికీ చేరాలి

– నిల్వలో ఉన్న మందులను కూడా తగ్గింపు ధరలకే విక్రయించాలి
– ఔషధ దుకాణాల్లో తగ్గించిన ధరల జాబితా ప్రదర్శించాలి
– కొరత సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
– మందుల నిల్వలు, కొనుగోళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
– అధికారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశాలు
– ఆసుపత్రులు, మందుల దుకాణాలకు విధివిధానాల జారీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
క్యాన్సర్‌ మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనం రోగులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మందుల లభ్యత, ధరల అమలుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆసుపత్రులు, మందుల దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. పాత ధరలతో ముద్రించిన మందుల నిల్వలను సైతం తగ్గించిన ధరలకే విక్రయించాలని పేర్కొన్నారు. అధిక ధరలకు విక్రయించడం, మందుల కొరత సృష్టించడం, అవసరానికి మించి నిల్వలు ఉంచడం వంటి అక్రమాలను అరికట్టాలని ఆదేశించారు.

దేశ‌వ్యాప్తంగా 1364 క్యాన్స‌ర్ నిరోధ‌క ఔష‌ధాల ధ‌ర‌ల‌ను సోమ‌వారం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం త‌గ్గించింది. 671 బ్రాండ్ల ధ‌ర‌ల్లో 50 శాతం కంటే ఎక్కువ త‌గ్గింది. ఎంఆర్‌పీలో అత్య‌ధికంగా 96.45 శాతం వ‌ర‌కు త‌గ్గింపు జ‌రిగింది.
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఈ క్యాన్సర్‌ మందుల ధరల అమలుకు త‌గ్గ‌ట్లు రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం కార్యదర్శి జి.వీరపాండియన్‌, ఔషధ నియంత్రణ ప‌రిపాల‌న‌ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌బాబు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రులు, మందుల దుకాణాల్లో ఇప్పటికే ఉన్న క్యాన్సర్‌ మందులను కూడా తగ్గించిన ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మందుల కొరత సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

అవసరాలకు తగ్గట్టే మందుల కొనుగోలు

క్యాన్సర్‌ చికిత్స అందించే ఆసుపత్రులు రోగులకు సూచించిన మందులను తగినంతగా అందుబాటులో ఉంచాలని మంత్రి చెప్పారు. ప్రతి ఔషధానికి తగ్గించిన ధరతో కనీసం ఒక కంపెనీ మందు నిల్వ ఉండేలా చూడాలన్నారు. రోగులు తమ అవసరాలకు అనుగుణంగానే మందులను కొనుగోలు చేయాలని సూచించారు. అవసరానికి మించి భారీగా మందులు కొనుగోలు చేసి నిల్వ చేయడం వల్ల ఇతర ఆసుపత్రులు, రోగులకు మందులు అందకుండా పోతాయని పేర్కొన్నారు.
మరోవైపు, ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌బాబు జిల్లాలకు జారీ చేసిన విధివిధానాల్లో తగ్గించిన క్యాన్సర్‌ మందుల విక్రయాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

పాత ధరలతో ఉన్న మందులను వెనక్కి పంపాల్సిన అవసరం లేదు

ఆసుపత్రుల మందుల విక్రయ కేంద్రాల్లో, వెబ్‌సైట్లలో తయారీ కంపెనీలు పంపిన సవరించిన ధరల జాబితా (ఫారం–వి)ను ప్రదర్శించాలి. పాత ధర ముద్రించిన మందుల ప్యాకెట్లను తిరిగి పంపాల్సిన అవసరం లేదు. వాటిపై కొత్త ధర ముద్రించాల్సిన అవసరమూ లేదు. అయితే సవరించిన ధర లేదా ప్యాకెట్‌పై ముద్రించిన ధర.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరకు మాత్రమే విక్రయించాలి. ప్రతి మందుకు సంబంధించిన బ్రాండ్‌ పేరు, బ్యాచ్‌ సంఖ్య, గరిష్ఠ చిల్లర ధర, వసూలు చేసిన మొత్తం వివరాలతో కూడిన బిల్లును రోగులకు ఇవ్వాలి. ఆసుపత్రుల మందుల విక్రయ కేంద్రాలు, క్యాన్సర్‌ చికిత్స విభాగాలు, డే కేర్‌ క్లినిక్‌లలో రోగుల హక్కులు, ఫిర్యాదుల విధానాన్ని తెలుగులో, ఆంగ్లంలో ప్రదర్శించాలి.

ఆసుపత్రుల తనిఖీలు

ప్రతి ఔషధ తనిఖీ అధికారి తన పరిధిలోని అన్ని క్యాన్సర్‌ ఆసుపత్రులు, చికిత్స కేంద్రాలను ఏడు రోజుల్లో తనిఖీ చేయాలి. ఆసుపత్రుల్లో సాధారణంగా వినియోగించే క్యాన్సర్‌ మందులు తగ్గించిన ధరలకు అందుబాటులో ఉన్నాయా, ప్రతి ఔషధానికి కనీసం ఒక కంపెనీ మందు నిల్వ ఉందా, ధరల జాబితా ప్రదర్శిస్తున్నారా అనే అంశాలను పరిశీలించాలి.

నవంబరు 9 నుంచి తగ్గించిన ధరలకు మందులు విక్రయిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు ప్రతి ఔషధానికి సంబంధించి ఇటీవల జారీ చేసిన బిల్లులను పరిశీలించాలి. పాత ధరలతో ముద్రించిన ప్యాకెట్లలో ఉన్న మందులను సైతం తగ్గించిన ధరలకే విక్రయిస్తున్నారా అనేది నిర్ధారించాలి.

సరఫరా ఏజెంట్ల వద్ద ధరల జాబితాల పరిశీలన

తయారీ కంపెనీల సరఫరా ఏజెంట్లు, సూపర్‌ స్టాకిస్టుల వద్ద ఔషధాల సవరించిన ధరల జాబితా (ఫారం–5) అందిందా లేదా ఔషధ తనిఖీ అధికారులు పరిశీలించాలి. నవంబరు 9 నుంచి జారీ చేసిన బిల్లుల్లో తగ్గించిన ధరలు నమోదు చేశారా, ఆ తేదీ నాటి నిల్వలు, ప్రస్తుత నిల్వలు ఎంత ఉన్నాయనే వివరాలను తనిఖీ చేయాలి.

ప్రస్తుత ధరల జాబితాలోని ధర లేదా ప్యాకెట్‌పై ముద్రించిన ధర.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానికి అనుగుణంగా విక్రయాలు జరగాలి. అధిక ధర వసూలు చేయకూడదు.

మందులు అందుబాటులో లేకపోతే 24 గంటల్లో చర్యలు

ఆసుపత్రి, రోగి లేదా వారి సహాయకుల నుంచి మందులు అందుబాటులో లేవని ఫిర్యాదు వస్తే ఔషధ తనిఖీ అధికారి 24 గంటల్లో స్పందించాలి. జిల్లా సరఫరాదారుల జాబితా ద్వారా మందుల నిల్వ ఎక్కడ ఉందో గుర్తించి, ఆసుపత్రి లేదా రోగికి మందులు అందేలా చర్యలు తీసుకోవాలి.

అక్రమాలపై చట్టపరమైన చర్యలు

తగ్గించిన ధరల కంటే అధికంగా మందులు విక్రయిస్తే బిల్లులు, రికార్డులను అధికారం కలిగిన అధికారి స్వాధీనం చేసుకోవాలి. మందుల ధరల జాబితాను ప్రదర్శించకపోతే 24 గంటల్లో నిబంధనలు పాటించాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలి.

మందుల విక్రయాన్ని నిలిపివేయడం లేదా నిరాకరించడం వంటి సందర్భాల్లో ఫిర్యాదుదారు, వ్యాపారి వాంగ్మూలాలను నమోదు చేయాలి. అనుమతి లేని వ్యక్తులకు మందులు విక్రయించడం వంటి ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేయాలి.

జిల్లా సహాయ సంచాలకులు తమ పరిధిలోని అమలును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి. క్యాన్సర్‌ ఆసుపత్రుల సంఖ్య, తనిఖీలు, సరఫరా ఏజెంట్లు, సూపర్‌ స్టాకిస్టుల వద్ద ధరల జాబితాల పరిశీలన, మందుల లభ్యతపై వచ్చిన ఫిర్యాదులు, 24 గంటల్లో పరిష్కరించిన ఫిర్యాదులు, అసాధారణ కొనుగోళ్లు, అధిక ధరల విక్రయాలు, విక్రయ నిరాకరణలు, అనుమతుల నిలిపివేత లేదా న్యాయ చర్యల వివరాలతో నివేదిక రూపొందించాలి.

ఫిర్యాదులు చేయాలంటే…

క్యాన్సర్‌ మందులు అందుబాటులో లేకపోయినా, తగ్గించిన ధర కంటే అధికంగా వసూలు చేసినా, మందులు ఇవ్వడానికి నిరాకరించినా రోగులు, ఆసుపత్రుల వారు ఔషధ నియంత్రణ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌బాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఔషధ నియంత్రణ శాఖ వాట్సాప్‌: 8632330909, ఈ-మెయిల్‌: dca-grams@ap.gov.in, ఎన్‌పీపీఏ టోల్‌ఫ్రీ నంబరు: 1800-111-255