లలిత్ బాబు అంతర్జాతీయ చెస్ విజయాలపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
క్రీడా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలని ధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ముసలప్పగారి రాహుల్ లలిత్ బాబును రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు పేర్కొన్నారు. యూరప్ గడ్డపై వరుస అంతర్జాతీయ చెస్ టైటిళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించిన లలిత్ బాబును విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలివారు. తాను సాధించిన ప్రతిష్టాత్మక ట్రోఫీలను మంత్రికి చూపించారు. తన విజయ ప్రస్థానాన్ని వివరించారు. ఈ సందర్భంగా లలిత్ బాబు మాట్లాడుతూ, జర్మనీలో జరిగిన 43వ మున్‌స్టర్‌ల్యాండ్ చెస్ ఓపెన్, స్పెయిన్‌లో జరిగిన బెనిడోర్మ్ చెస్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లలో ఛాంపియన్‌గా నిలిచినట్లు మంత్రికి తెలిపారు. ముఖ్యంగా, రెండు టోర్నీల ఫైనల్ రౌండ్లలో అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్లపై నల్లటి పావులతో ఆడి, ఒత్తిడిని అధిగమించి సాధించిన క్లచ్ విజయాలను ప్రస్తావించారు. సుదీర్ఘ ప్రయాణాలు, కఠినమైన పోటీ ఉన్నప్పటికీ దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

లలిత్ విజయాలపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. లలిత్ బాబును ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ప్రపంచ టాప్ ర్యాంకింగ్స్‌లోకి దూసుకెళ్లాలనే లలిత్ బాబు ఆశయానికి ప్రభుత్వం నుండి తగిన సహకారం అందిస్తామని సూచించారు. ఇదే స్పూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని, మరింత మందిని క్రీడల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.