విద్యార్థినులకు ‘త్రిశూల వ్యూహం’పై అవగాహన కల్పించిన మహిళా పోలీస్ అధికారులు

-సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళలు–బాలికల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, రహదారి భద్రతతో పాటు మహిళలు, బాలికల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘త్రిశూల వ్యూహం’ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్, కె.జి.వి. సరిత ఐపీఎస్, పశ్చిమ డీసీపీ రామకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ వి.ఎస్.ఎన్. వర్మ, ఇన్‌స్పెక్టర్ పి. జగదీష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కళాశాలలో విద్యార్థినులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ భద్రత, రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు మరియు పిల్లల రక్షణ, గంజాయి, డ్రగ్స్ తదితర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను చిన్నచిన్న వీడియోల ద్వారా వివరించారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాల్సిన విధానాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, లాటరీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు అమలులో ఉన్నాయని, ఆపద సమయంలో అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థినులకు హితవు పలికారు.

నేరరహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల్లో ముఖ్యంగా యువతలో నేరాల పట్ల అవగాహన పెంపొందించి, సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు.