అమరావతిలో గ్రీన్ ఎనర్జీ విప్లవానికి శ్రీకారం!

-పర్యావరణహిత ఇంధన వ్యవస్థ ఏర్పాటుకు IOCLతో APCRDA కీలక ఒప్పందం
-PNG, CNG, ఈవీ ఛార్జింగ్, గ్రీన్ హైడ్రోజన్, బయోగ్యాస్ వంటి ఆధునిక ఇంధన సదుపాయాలపై సంయుక్త కార్యాచరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతిని పర్యావరణహిత, సుస్థిర ఇంధన వ్యవస్థతో కూడిన ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాజధానిలో అధునాతన హరిత ఇంధన మౌలిక వసతుల ఏర్పాటుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) మంగళవారం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

ఈ మేరకు APCRDA ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్, IOCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్ (TAPSO) పీయూష్ మిట్టల్ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో APCRDA ఎకనామిక్ డెవలప్‌మెంట్ విభాగం అధికారులు, సిబ్బందితో పాటు IOCL ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమగ్ర హరిత ఇంధన వ్యవస్థకు ప్రణాళికలు

అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేసే క్రమంలో నగర మాస్టర్ ప్లాన్‌లోనే అత్యాధునిక హరిత ఇంధన మౌలిక వసతులను అంతర్భాగం చేయాలని APCRDA లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా పెట్రోలియం ఇంధనాలు, ఎల్ఎన్‌జీ (LNG), ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ఫ్యూయల్స్ రంగాల్లో విశేష అనుభవం కలిగిన IOCLతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది.

అత్యాధునిక ఇంధన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి

ఈ ఒప్పందం ద్వారా అమరావతిలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (PNG, CNG), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు, కంప్రెస్డ్ బయోగ్యాస్, గ్రీన్ హైడ్రోజన్, తక్కువ కార్బన్ ఉద్గారాలకు దోహదపడే ఇతర ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారాలపై రెండు సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి, సాధ్యమైన ప్రాజెక్టులను అమలు చేయనున్నాయి.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎనర్జీ మాస్టర్ ప్లాన్

రాజధాని అమరావతిలో ప్రస్తుత, భవిష్యత్తు ఇంధన అవసరాలను సమగ్రంగా అంచనా వేసి ‘ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ మాస్టర్ ప్లాన్’ రూపొందించనున్నారు. దీని ద్వారా పర్యావరణానికి మేలు చేసే రవాణా వ్యవస్థ, సుస్థిరమైన మొబిలిటీ మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు.

స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌తో మల్టీ ఫ్యూయల్ స్టేషన్లు

నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక మల్టీ ఫ్యూయల్ ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుతో పాటు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ వ్యవస్థ కలిగిన యుటిలిటీ కారిడార్ల అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడనుంది. భవిష్యత్తులో వివిధ రకాల వాహనాలకు అవసరమైన ఇంధన సదుపాయాలను ఒకే వ్యవస్థలో అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రణాళికలో ప్రధాన అంశం.

సంయుక్త కార్యవర్గంతో ప్రాజెక్టుల పర్యవేక్షణ

ఈ ప్రాజెక్టుల అమలు, పురోగతి పర్యవేక్షణ, సాంకేతిక అధ్యయనాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (DPRs) రూపకల్పన కోసం APCRDA, IOCL ప్రతినిధులతో సంయుక్త కార్యవర్గాన్ని (Joint Working Group) ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యవర్గం క్రమం తప్పకుండా సమావేశమై ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ, అమలుకు అవసరమైన కార్యాచరణను రూపొందించనుంది.

IOCL తరఫున పాల్గొన్న అధికారులు:

పీయూష్ మిట్టల్ – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్, TAPSO.
టి. ముత్తు కుమారన్ – స్టేట్ రిటైల్ హెడ్, TAPSO.
వినీత్ భాస్కర్ – స్టేట్ లా హెడ్, TAPSO.
ఆనంద్ ద్వివేది – డివిజనల్ రిటైల్ సేల్స్ హెడ్, విజయవాడ.
నల్లి శ్రీకాంత్ – సీనియర్ మేనేజర్, రిటైల్ సేల్స్.

ఈ ఒప్పందంతో అమరావతి రాజధానిలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఇంధన మౌలిక వసతుల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. సుస్థిర అభివృద్ధి, స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక రవాణా వ్యవస్థల సమన్వయంతో అమరావతిని పర్యావరణహిత ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఈ భాగస్వామ్యం కీలకంగా నిలవనుంది.