విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థుల బృందం కృతజ్ఞతపూర్వకంగా సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నట్లు రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి మరియు టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ నుంచి తరలివచ్చిన విద్యార్థుల బృందంలో జిల్లాకు ఒక్క విద్యార్థి చొప్పున ముఖ్యమంత్రిని కలవనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రిని విద్యార్ధుల బృందం కలవనున్నది. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి చూపిన ప్రత్యేక చొరవతో ఆ దేశంలో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులు, ఇతరులను రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం ఏర్పడిన అనంతరం రాష్ట్ర విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జై శంకర్ కి లేఖ రాయడంతో పాటు వెలగపూడి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ లో ఉన్న రాష్ట్ర విద్యార్థులకు సహాయం అందేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 918 మంది విద్యార్థులు/ఇతరులు రాష్ట్రానికి చేరుకున్నారని కృష్ణబాబు తెలిపారు. వివిధ విమానాశ్రయాల నుంచి 692 మంది (ఢిల్లీలో 549 + ముంబైలో 143) విద్యార్థులు/ఇతరులను ప్రభుత్వ సహాయ చర్యలతో వారివారి స్వస్థలాలకు చేర్చామన్నారు. మరో 226 విద్యార్థులు/ఇతరులు వారి సొంత ఏర్పాట్లతో రాష్ట్రానికి చేరుకున్నట్లు ఆయన చెప్పారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …