-మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు: విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ తదుపరి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున ఆదివారం నుంచి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా వీలైనంత త్వరగా తీరానికి తిరిగి రావాలని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, గురువారం (22-10-2026) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
