Breaking News

విద్యుత్ ఉద్యోగసంఘాల జెఎసి నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ

– విద్యుత్ రంగ ఉద్యోగులకు అండగా ఉంటాం
– ఉద్యోగసంఘాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా చూస్తోంది
– యాజమాన్యం, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు
– విద్యుత్ రంగం ఎన్నో ఓడిదొడుకులను ఎదుర్కొంటోంది
– ఈ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు
– గత ప్రభుత్వం నిర్వాకం వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుంది
– అందరం కలిసి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం
-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ రంగ ఉద్యోగులు, కార్మికులకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. సచివాలయంలో బుధవారం ఉద్యోగసంఘాల జెఎసి ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగసంఘాల నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. సంస్కరణల పేరుతో ప్రైవేటుపరం వైపు నడుస్తున్న విద్యుత్ రంగాన్ని గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఆదుకుని, అటు సంస్థను, ఇటు ఉద్యోగుల ప్రయోజనాలను కూడా కాపాడారని ఉద్యోగసంఘాల నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ  వైయస్ జగన్ సీఎంగా భారీ నష్టాల్లో ఉన్న విద్యుత్ రంగానికి అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అదే క్రమంలో ప్రభుత్వ తోడ్పాటుతో ఉద్యోగులు సైతం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని, తమ సమస్యలను కూడా యాజమాన్యం, ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కేవలం హక్కుల కోసమే కాకుండా ప్రజలతో ముడిపడి ఉన్న సంస్థగా విద్యుత్ రంగాన్ని గమనిస్తూ మరింత బాధ్యతతో కూడా పనిచేయాలని, అప్పుడే సంస్థ మరింత ముందుకు వెడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగసంఘాల విషయంలో ఈ ప్రభుత్వం సానుకూల దృక్పథంతోనే పనిచేస్తోందని, యాజమాన్యం, ఉద్యోగులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల విద్యుత్ రంగం భారీగా అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ సంక్షోభం నుంచి విద్యుత్ రంగాన్ని గట్టేక్కించేందుకు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ప్రయత్నాలకు ఉద్యోగులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ట్రాన్స్ కో జెఎండి ఐ.పృథ్వితేజ్, విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, ఎపి స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జెఎసి నాయకులు పి.చంద్రశేఖర్, బి.సాయికృష్ణ, కెవి శేషారెడ్డి, ఎవిఎస్ సత్యనారాయణ, ఎవి కిరణ్, కె.శ్రీనివాస్, టి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *