గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
గొల్లపూడి గ్రామపంచాయతీ ఎన్నికల్లో బొమ్మసాని కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ వారసుడిగా బొమ్మసాని జయంత్ సాయి ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా హాజరై జయంత్ సాయికి మద్దతు తెలిపారు. అనంతరం అభ్యర్థి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. గొల్లపూడి గ్రామ రాజకీయాల్లో బొమ్మసాని కుటుంబం మూడు తరాలుగా కొనసాగుతోంది. దీంతో బొమ్మసాని కుటుంబం నుంచి మూడో తరం నాయకత్వం గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లయింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మాట్లాడుతూ, గొల్లపూడి గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తోందన్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. కూటమి అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయికి ప్రజలు మద్దతు అందించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సర్పంచ్ అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయి మాట్లాడుతూ, గొల్లపూడి గ్రామ సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామమోహనరావు (గాంధీ), బీజేపీ నాయకులు, విజయవాడ రూరల్ జెడ్పీటీసీ నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల), మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
