– 23.87 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలపై ప్రత్యేక దృష్టి
– తీరప్రాంత 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్ల పంటల రక్షణకు ప్రాధాన్యం
– 16 జిల్లాల్లో 2.69 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలకు ముందస్తు రక్షణ చర్యలు
– 30,808 బోట్లలో తీరానికి చేరిన 30,635 బోట్లు.. మిగిలిన 173 బోట్లపై నిరంతర పర్యవేక్షణ
– మత్స్యకారులకు 1.08 లక్షల వాయిస్ హెచ్చరికలు.. 350 ల్యాండింగ్ కేంద్రాల్లో అప్రమత్తం
– పంట నష్టంపై 24 గంటల్లో ప్రాథమిక నివేదికలు.. రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు
– వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అక్వాన్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటలకు నష్టం జరగకుండా, మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులు, మత్స్యకారులకు అండగా ఉంటుందని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికీ తావివ్వొద్దని స్పష్టం చేశారు.
23.87 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో నవంబర్ 14 నాటికి 21.32 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు పొలాల్లో ఉండగా, 2.55 లక్షల హెక్టార్లలో రబీ పంటలు వేశారని మంత్రి తెలిపారు. మొత్తం 23.87 లక్షల హెక్టార్లలో పంటలు ఉన్నాయని, ఇందులో వరి 13.60 లక్షల హెక్టార్లు, కంది 4.42 లక్షల హెక్టార్లు, పత్తి 1.92 లక్షల హెక్టార్లలో సాగులో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్లలో పంటలు ఉండగా, అందులో 9.16 లక్షల హెక్టార్లలో వరి పంట ఉందన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందుగానే సేకరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలు శుభ్రం చేయాలని, భారీ వర్షాల సమయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీ నిలిపివేయాలని తెలిపారు. వర్షాలు తగ్గి నేల అనుకూలంగా మారిన తర్వాతే రబీ విత్తనాలు వేయాలని సూచించారు.
16 జిల్లాల్లో 2.69 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటల రక్షణకు చర్యలు
తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 16 జిల్లాల్లో 2,69,831 హెక్టార్ల ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ఇందులో మిరప 1,08,615 హెక్టార్లు, కొబ్బరి 98,526 హెక్టార్లు, పసుపు 24,469 హెక్టార్లతో పాటు అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు ఉన్నాయని తెలిపారు. పల్నాడు, కోనసీమ, మార్కాపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అరటి, బొప్పాయి మొక్కలకు ఊతం ఏర్పాటు చేయాలని, కోతకు సిద్ధమైన పంటలను ముందుగానే మార్కెట్లకు తరలించాలని సూచించారు. నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవడంతో పాటు శాస్త్రవేత్తల సూచనలను రైతులకు చేరవేయాలని ఆదేశించారు.
సముద్రంలోని 173 బోట్లపై నిరంతర పర్యవేక్షణ
రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఉన్న 12 జిల్లాల్లో మత్స్యశాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 30,808 బోట్లలో నవంబర్ 16 ఉదయం 10 గంటల నాటికి 30,635 బోట్లు సురక్షితంగా తీరానికి చేరాయని, మిగిలిన 173 బోట్లను కూడా క్షేమంగా తీరం చేర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. కాకినాడలో 78, బాపట్లలో 38, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో చెరో 24, కృష్ణా జిల్లాలో 9 బోట్లు సముద్రంలో ఉన్నాయని వివరించారు. మత్స్యకారులకు ఇప్పటికే 1,08,250 వాయిస్ హెచ్చరికలు పంపించామని, 8,217 బోట్లను నాభిమిత్ర వ్యవస్థ ద్వారా ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. తీరప్రాంతంలోని 555 మత్స్యకార గ్రామాలు, 350 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలి
తుఫాను సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని మంత్రి సూచించారు. ఆక్వా రైతులు చెరువుల గట్లను బలోపేతం చేసుకోవాలని, నీటిలో ఆక్సిజన్, పీహెచ్, లవణీయత స్థాయిలను పర్యవేక్షించాలని తెలిపారు. బోట్లు, వలలు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉంచుకోవాలన్నారు. అన్ని హేచరీలతో పాటు 1,446 అంతర్గత మత్స్యకార సహకార సంఘాలకు ముందస్తు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు.
పంట నష్టాల నమోదులో నిర్లక్ష్యం వద్దు
తుఫాను ప్రభావంతో ఉద్యాన పంటలకు నష్టం జరిగితే 24 గంటల్లో ప్రాథమిక నివేదికలు, వారం రోజుల్లో రైతులవారీగా పూర్తి వివరాలు అందించాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ పంటల నష్టాలను రెవెన్యూ శాఖతో కలిసి అంచనా వేయాలని, 33 శాతానికి మించి నష్టం జరిగిన పంటలకు నిబంధనల ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వ్యవసాయ పంటల పరిస్థితిపై ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు APAIMS యాప్‌లో నివేదికలు నమోదు చేయాలని తెలిపారు. రైతులకు 155251 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా అవసరమైన సూచనలు అందించాలన్నారు. రైతులు పండించిన పంటలను, మత్స్యకారుల ప్రాణాలను, జీవనోపాధిని కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, విపత్తు సమయంలో అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
