విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ పరమాత్మ గోపికలలో చేసిన రాసలీలల గురించి ప్రజా బాహుళ్యంలో ఉన్న కథనాలన్నీ కేవలం అపోహలు మాత్రమేనని, జీవాత్మ పరమాత్మను చేరుకోవటమే రాసలీలలోని అంతరార్థమని విఖ్యాత పండితులు ‘అద్వైతసిద్ధి రత్నాకర’ మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి అన్నారు. ప్రముఖ వ్యాపారవేద్త, వేదపోషకులు మాగంటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలోజరుగుతున్న అష్టోత్తరశత (108) భాగవత పారాయణ, ప్రవచన మహాయజ్ఞం ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం నాటి కార్యక్రమంలో తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి పగిడాల ఆనంద తీర్థాచార్యులు భాగవతంలోని దశమస్కంధ విశేషాలు వివరించారు. కృష్ణుడి బాల్యంలోని ఘట్టాలు, రేపల్లెలో పరమాత్మ చూపిన లీలావిలాసాలు, వాటిలోని అంతరార్థాలను ఆయన వివరించారు. అనంతరం దత్తాత్రేయశాస్త్రి ‘రాస పంచాధ్యాయి’ గురించి ప్రవచనం చేశారు. రాసలీలలంటే శృంగార క్రీడలనే భావన సరైంది కాదన్నారు. రసం అంటే రుచి అని, విశ్వంలోని అన్ని వస్తువుల కన్నా మాధుర్యం కలిగినది కృష్ణ నామమే అన్నారు. కృష్ణావతారం పరిపూర్ణ అవతారమని వివరించారు. చివరగా పురాణం మహేశ్వరశర్మ ‘రుక్మిణీ వివాహం’ ఘట్టాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తూ ప్రవచనం చేశారు. పండితులందరినీ కార్యక్రమ నిర్వాహకులు మాగంటి సుబ్రహ్మణ్యం ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ కోవిడ్ నుంచి దేశానికి ఊరట కలగాలని, లోక సంక్షేమం కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజ హితం కోసం ఉదారబుద్ధితో సుబ్రహ్మణ్యం చేస్తున్న భాగవత పారాయణ మహాయజ్ఞం విజయవాడ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. తండ్రితో పాటు మాగంటి సుబ్రహ్మణ్యం కుమారులు కూడా పూర్తి ధర్మబుద్ధితో ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంపంచుకోవటం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ గాయకు మల్లాది సూరిబాబు, శ్రీరాం ప్రసాద్ నారాయణతీర్థులు, క్షేత్రయ్య తదితరులు రచించిన తరంగాలతో పాటు పలు కృష్ణ స్తోత్రాలు గానం చేశారు. లబ్బీపేట దేవస్థానం మేనేజర్ శర్మ, తి.తి.దే. ఇ.సి. కమిటీ సభ్యులు ‘శృతిభూషణం’ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి, విష్ణుభట్ల ఆంజనేయ చయనులు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.