Breaking News

అర్హత కలిగిన యువత ఓటరుగా నమోదు కావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్ల పాత్ర కీలకమని అర్హత కలిగిన యువత ఓటరుగా నమోదు కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. నగరంలోని మొగల్రాజపురం పిబి సిద్దార్థ ఆర్ట్స్‌ అండ్‌సైన్స్‌ కళాశాల ఆడిటోరియంలో బుధవారం స్వీప్‌(సిస్టమేటిక్‌ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోల్‌ పార్టిసిపేషన్‌) లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం నవంబర్‌ నెలలో ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాప్ట్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌) ప్రచురించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కొత్తగా నమోదైన ఓటర్లు, తొలగించిన, మార్పులు చేర్పులు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా డ్రాప్ట్‌ రోల్‌ ప్రకటించడం జరుగుతుందన్నారు. జనాభాలోని స్త్రీ, పురుష నిష్పత్తి ఆధారంగా ఓటర్ల నమోదు, దీనితో పాటు జనాభాలో 18 నుండి 19 సంవత్సరాల వయసు గల యువత ప్రతి ఒక్కరూ ఓటర్లగా ఉండాలనే నిష్పత్తిని పాటించాలన్నారు. యువత ఓటర్‌గా నమోదు కావడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను తమ తోటి వారిని ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. 2023 జనవరి 5 వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించడం జరుగుతుందని ఇలాగా డ్రాప్ట్‌ పబ్లికేషన్‌లో ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ ప్రకటించామని ఆయా పొలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు జాబితాను సరిచూసుకోవాలన్నారు. బూత్‌ లెవల్‌ అధికారులు కూడా అందుబాటులో ఉంటారన్నారు. 18 సంవత్సరాల నిండిన యువత భాధ్యతాయుతమైన పౌరులుగా ఓటర్లుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర ఓటర్లదేనని బాధ్యతగల ప్రతి పౌరుడు విధిగా ఓటు హక్కును కలిగి ఉండాలన్నారు. దేశాభివృద్ధికి పటిష్ట ప్రజా స్వామ్యానికి ఓటు హక్కు ఎంతో కీలకమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని దానిని కలిగి ఉండడం మనందరి భాధ్యత అని అన్నారు. 18 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఓటర్లుగా నమోదు పై అంతగా ఆసక్తి చూపడం లేదని ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుసుకుని ఓటర్లుగా నమోదుపై యువత ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజాస్వామ్యంలో యువ ఓటర్ల పాత్ర కీలకంగా ఉండాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో డ్రాప్ట్‌ పబ్లికేషన్‌, బిఎల్వోలు అందుబాటులో ఉంటారని ఓటర్‌గా నమోదు కాని వారు అన్‌లైన్‌, ఆప్లైన్‌ విధానంలో నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓటు గురించి కాకుండా ముందుగానే జాగ్రత్త పడాలన్నారు. ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన ఫారం`8 ద్వారా ఓటును నియోజవర్గం నుండి మరొక నియోజకవర్గానికి మార్పు చేసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్‌ అన్నారు.
కార్యక్రమంలో ఓటుహక్కు కలిగి ఉండటం ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధానంతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించే నాటిక ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
అనంతరం భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై , విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయలను స్వేచ్చాయుత నిష్పత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
తొలిత ఓటు హక్కు నమోదు పై అవగాహనా ర్యాలీని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా, జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన ర్యాలీ స్టేడియం నుండి ప్రారంభమై మొగల్రాజపురం పి.బి. సిద్ధార్థ ఆర్డ్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆడిటోరియంకు చేరుకుంది. యువత మెలుకో… ఓటు హక్కు వాడుకో…., ఆవేశంతో కాదు… ఆలోచించి ఓటు వేయి…, మన ఓటు మన హక్కు మన భవిత తదితర నినాదాలతో ప్రజలను చేతన్య పరుస్తూ ర్యాలీ సాగింది.
విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి పిబి సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఉన్న తొమ్మిది పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో డ్రాప్ట్‌ రోల్‌ను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కళాశాల ప్రిన్సిపాల్‌ యం. రమేష్‌కు అందజేశారు. కార్యక్రమంలో స్వీిప్‌ నోడల్‌ ఆఫీసర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, నగర పాలక సంస్థ అడిషనల్‌ కమీషనర్‌ శ్యామల, పిఓయుసిడి శకుంతల, సిటీ ప్లానర్‌ జివిజి ఎస్‌ వి ప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ ఎం రమేష్‌, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *