Breaking News

25 సంవత్సరాల వరకు జగనే ముఖ్యమంత్రి.. ఇది శిలాశాసనం…

-మంత్రి జోగీ రమేష్

బంటుమిల్లి (బంటుమిల్లి/రామన్నమోడి/ములపర్రు), నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న 25 సంవత్సరాల వరకు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఇది శిలాశాసనం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. బంటుమిల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మొదటిగా బంటుమిల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వసతుల కల్పనకు మనబడి నాడు-నేడు 2వ దశ కార్యక్రమం క్రింద రూ.59.04 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని రామన్నమోడీ గ్రామంలో రూ.7 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రం, ములపర్రు గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగనవాడీ భవనాలను మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

ఆయా కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడారు. రామన్న మోడీ గ్రామంలో మంత్రి మాట్లాడుతూ రానున్న 25 సంవత్సరాల వరకు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఇది రాష్ట్ర ప్రజలు రాసిపెట్టిన శిలాశాసనం అని ఉద్ఘాటించారు. తల్లి గర్భం ధరించిన దగ్గర నుంచి వారి పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజల బాగోగులను చూసుకుంటున్నారన్నారు. ఓట్ల కోసం ఎన్నికలకు ముందు తాయిలాలు పంచే రకం ఈ ప్రభుత్వం కాదని, సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మరుసటి రోజు నుంచే జగన్ తన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారన్నారు. కులమత రాజకీయాలు చూడకుండా ప్రజలందరూ నా వాళ్లేనన్న రీతిలో సమానంగా చూస్తూ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. దీని ఫలితంగానే వచ్చే 25 సంవత్సరాల వరకు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర ప్రజలు మనసారా కోరుకుంటున్నారని, ఇది గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రహించిన సత్యమని మంత్రి పేర్కొన్నారు.

ఆయా కార్యక్రమాల్లో విద్యార్థులు, గ్రామస్తులతో మంత్రి ముచ్చటించారు. రూ.45 లక్షల నిధులతో రామన్నమోడి, ములపర్రు గ్రామాల్లో ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతోపాటు అవసరమైన చోట్ల రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని మంత్రి విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల జెడ్పీటీసీలు మలిసెట్టి వెంకట రమణ, మైలా రత్నకుమారి, బంటుమిల్లి ఎంపిపి వెలివెల చినబాబు, వైస్ ఎంపీపీ ఒడిమి చిన్నారిబాబు, ఏఎంసీ చైర్మన్ పి. బాబురావు, బంటుమిల్లి ఎంపిడిఓ స్వర్ణ భారతి, కళాశాల ప్రిన్సిపల్ ఎస్.కృష్ణ కిషోర్, ములపర్రు గ్రామ సర్పంచ్ బొడ్డు మంగమ్మ, వైసీపీ మండల కన్వీనర్ రాజాబాబు, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *