Breaking News

యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎంఎంఆర్) కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ..

-దేశంలో యాక్షన్ ప్లాన్ రూపొందించిన నాల్గవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్..
-యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై విజయవాడలో నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాపులో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు
-శనివారం విడుదల చేయనున్న “ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ బలోపేతానికి సంబంధించిన విజయవాడ డిక్లరేషన్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్) నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు, విధివిధానాల అభివృద్ధిని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు గ్లోబల్ వర్క్ షాప్ లో మొదటి రోజున వర్చువల్ విధానంలో వివరించారు. శుక్ర, శనివారాల్లో (రెండు రోజులు) నిర్వహించే ఈ కార్యక్రమానికి విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ వేదికైంది. ఎఎంఆర్ పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (FABA), ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా (IFCAI), వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ (WAP) వంటి ప్రపంచ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎం.టీ. కృష్ణబాబు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఎఎంఆర్ కట్టడికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న నాలుగో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ముందుగా కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలు ఈ కార్యా చరణ ప్రణాళికను అభివృద్ధి చేసి ఎఎంఆర్ కట్టడికి కసరత్తు ప్రారంభించాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న కార్యాచరణ ప్రణాళికతో అనుసంధానం చేస్తూ కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎఎంఆర్ కారణంగా ఏటా దాదాపు 15 లక్షల మంది మరణిస్తున్నారని, ఎఎంఆర్ సంబంధిత వ్యాధుల వల్ల 50 లక్షల మందికి పైగా చనిపోతున్నారని తెలిపారు. ఎఎంఆర్ కట్టడికి కృషిచేస్తున్న ప్రపంచ సంస్థలతో సదస్సులను నిర్వహించడం వల్ల ఏ ఏ అంశాలపై దృష్టి సారించాలనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు. తద్వారా ల్యాబరేటరీలను బలపర్చడం, మెడికల్ ఎడ్యుకేషన్, ప్రజల్లో అవగాహన తీసుకొస్తామన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) ఆధ్వర్యంలో ఇండో-డచ్ ప్రాజెక్టును రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేస్తున్నామని వివరించారు. ఇన్ పెక్షన్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పద్దతిని సీడీసీ ఆధ్వర్యంలో 21 ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. కేవలం ప్రిస్కిప్షన్ ఉన్న యాంటీ బయోటిక్స్ మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్ఎంపీలు, ఫార్మసీలు అవసరం లేకున్నా యాంటీ బయోటిక్స్ వాడకాన్ని ప్రొత్సహించడం వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమతుందన్నారు. ఈ వర్క్ షాపు ఎఎంఆర్ ను కట్టడి చేయడానికి సరైన ప్రణాళికలను అందజేస్తుందని ఎం.టి. కృష్ణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 2022 జూన్లో ఆంధ్రప్రదేశ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ది కంటైన్మెంట్ ఆఫ్ యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ (ఏపీఏపీసీఏఆర్)ను రూపొందించిన నాలుగో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎ.ఎం.ఆర్ రంగంలో సాధించిన పురోగతిని స్టేక్ హోల్డర్స్, ప్రతినిధులకు వివరించారు. కార్యాచరణ ప్రణాళిక అమలులో అవసరమైన మద్దతును అందించడానికి ప్రభుత్వం అన్ని సహకరిస్తుందన్నారు. రాష్ట్రం ఆక్వా, పౌల్ట్రీ ఉత్పత్తులకు పెద్ద ఎగుమతిదారుగా ఉన్న నేపధ్యంలో యాంటీబయాటిక్స్ యొక్క సముచిత వినియోగంలో ప్రజల్లో అవగాహన కల్పించడం గురించి ఆయన నొక్కి చెప్పారు.డ్రగ్ కంట్రోల్ డీజీ రవి శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ఇండో-డచ్ సహకారంతో ఎఎంఆర్ పైలట్ ప్రాజెక్టులో చేసిన పనిని, ఎఎంఆర్ యొక్క ముప్పును పరిష్కరించడానికి ఆచరణాత్మక పరిష్కారాలను చూడవలసిన అవసరాన్ని వివరించారు. తాను ప్రాజెక్టుకి నోడల్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో, ఎఎంఆర్ యాక్షన్ ప్లాన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2022లో నివేదిక సమర్పించామని, అనంతరం ఎఎంఆర్ కట్టడి కోసం రూపొందించిన రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ జిఓ నెం. 148 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటికే పలు సమావేశాలను నిర్వహించి.. ఇప్పుడు గ్లోబల్ వర్క్ షాప్ తో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.IFCAI ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎఎంఆర్ సంబంధిత మరణాల సంభవం, ఎఎంఆర్ యొక్క నివారణ & నియంత్రణ యొక్క తక్షణ ఆవశ్యకతపై ప్రపంచ దృక్పథాన్ని అందించారు. 2050 నాటికి ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా, భారతదేశంలో దాదాపు 50 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఆణ్వాయుధలాంటి యాంటీబయెటిక్స్ ని విచ్చలవిడిగా వాడడం వల్ల రాబోయే కాలంలో అవికూడా పనిచేయకుండా మానవాళి మనగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.ఎన్సీడీసీ అదనపు డైరెక్టర్ డాక్టర్ లతా కపూర్, తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంగమ్మ లు కంటైన్మెంట్ చర్యలు, ఏఎంఆర్ నిఘాను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. పర్యావరణంలో యాంటీబయాటిక్స్, విభిన్న వర్ణపటాలకు వ్యతిరేకంగా బ్యాక్టీరియా ఎలా నిరోధకతను అభివృద్ధి చేస్తుందో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ నియాజ్ అహ్మద్ వివరించారు. “ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ల బలోపేతానికి సంబంధించిన విజయవాడ డిక్లరేషన్” శనివారం విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏబీఏ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రెడ్డన్న, స్వాగతం పలికి రెండు రోజుల వర్క్ షాపును ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ కు అనేక దేశాల నుంచి (నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, బంగ్లాదేశ్ మొదలైనవి), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ఎన్ సిడిసి, యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (యుఎస్ సిడిసి), డబ్ల్యుహెచ్ఓ, ఫ్లెమింగ్ ఫండ్ మొదలైన జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ఏపీ ఎఎంఆర్ అమలు భాగస్వాములు పాల్గొన్నారు.
జారీ చేసినవారు : కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *