Breaking News

సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థిక పరిపుష్టి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-1 వ డివిజన్ 4 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలతో పేద కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 4 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర నగర్లో విస్తృతంగా పర్యటించి.. 324 గడపలను సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అర్హులకు అవగాహన కల్పిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి కావలసిన కనీస సదుపాయాలన్నింటినీ ఈ ప్రభుత్వం సమకూర్చడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగేలా, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. వేసవి దృష్ట్యా తాగునీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. చివరి గడప వరకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రహదారికి ప్యాచ్ వర్కులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అలాగే ఎక్కడా లోఓల్టేజీ సమస్యలు రాకుండా చూడాలని విద్యుత్ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం
సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధమని మల్లాది విష్ణు అన్నారు. 51,392 నిరుపేద కుటుంబాలు పాల్గొనే ఈ కార్యక్రమంలో.. సెంట్రల్ నుంచి 7,211 లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో 1వ డివిజన్ కు సంబంధించి 1,238 కుటుంబాలు ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పటికే లేఅవుట్లలో అన్ని ప్లాట్లకు నంబర్లు కేటాయించి మార్కింగ్‌ కూడా పూర్తిచేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాలివ్వకుండా తెలుగుదేశం పార్టీ అనేక కుట్రలు పన్నిందని.. కానీ చివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానాలు సమర్థించడంతో శుక్రవారం ముఖ్యమంత్రి చేతులమీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

మేనిఫెస్టో మాటెత్తే అర్హత చంద్రబాబుకి లేదు
మేనిఫెస్టో అనే పదం చంద్రబాబు ఎత్తితేనే ప్రజలు నవ్వుకుంటున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఇతర పార్టీల మేనిఫెస్టోలను కాపీ కొట్టడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరికీ కనపడకుండా మేనిఫెస్టోని మాయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. ఒక పుస్తకం లాంటి మేనిఫెస్టోను తయారుచేయడం, ఆర్భాటంగా విడుదల చేయడం, అధికారంలోకి రాగానే దానిని మర్చిపోవడం తెలుగుదేశానికి అలవాటేనని పేర్కొన్నారు. మేనిఫెస్టోను ప్రజలను మభ్యపెట్టే మాయాజాలంగా మార్చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదేనని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే 2014 మేనిఫెస్టోలో ఏఏ హామీలు అమలు చేశారో మహానాడులో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు బేషరతుగా రుణాల మాఫీ అని చెప్పి దానిపై కోటయ్య కమిటీని ఏర్పాటుచేసి నీరుగార్చారన్నారు. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా రైతుల అప్పులపై పడే వడ్డీలకు కూడా సరిపోని విధంగా రూ.24 వేల కోట్లతో సరిపెట్టారని గుర్తుచేశారు. చివరి 4, 5 విడతలను కూడా ఎగ్గొట్టారని ఆరోపించారు. ఫలితంగా రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా, చేనేత రుణాల మాఫీని సైతం పూర్తిగా తుంగలో తొక్కారని.. కోటయ్య కమిటీ తన నివేదికలో డ్వాక్రా రుణాలు మాఫీకి వీలుగా సిఫార్సు చేసినా చంద్రబాబు అమలు చేయలేదని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. చివరకు వడ్డీలు తడిసిమోపెడై మహిళలు బ్యాంకుల నుంచి నోటీసులు అందుకోవలసి వచ్చిందని దుయ్యబట్టారు. అయినా సిగ్గులేకుండా మరోసారి మేనిఫెస్టో అంటూ మహానాడులో ఏముఖం పెట్టుకుని ప్రవేశపెడుతున్నారో అర్థం కావడం లేదని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, సీడీఓ జగదీశ్వరి, 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు ఉద్ధంటి సురేష్, కొండా మహేశ్వర్ రెడ్డి, బండి వేణు, కనకరావు, మండాది వెంకట్రావు, నాగరాజు, కొలకలేటి రమణి, భాగ్యలక్ష్మి, వై.శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *