40వ డివిజన్‌లో బీజేపీ ప్రచార హోరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి పగడాల వెంకట రామకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఊర్మిళ నగర్‌లో నిర్వహించిన ప్రచారంలో బీజేపీ సీనియర్ నాయకులు లాకా వెంగళరావు యాదవ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు మోరబోయిన రాంబాబు, వల్లభనేని లక్ష్మీ ప్రసన్న తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ ఓటర్ల మద్దతు కోరారు.
ఈ సందర్భంగా పగడాల వెంకట రామకృష్ణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుజనా చౌదరి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని తెలిపారు. 40వ డివిజన్‌లో ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పన, డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఓటర్లు కమలం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు శివకుమార్ పట్నాయక్, గోవిందమ్మ, మంగళపురి మహేష్, గోళ్ల విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.