అర్న‌బ్ నేపథ్యంలో స‌ర‌స్ మేళా అక్టోబర్ 28న తాత్కాలికంగా మూసివేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) జారీచేసిన హెచ్చరిక దృష్ట్యా, విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ స‌ర‌స్ మేళా–2026ను అక్టోబర్ 28న ప్రజల సందర్శనార్థం తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. సందర్శకులు, పాల్గొంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, చేతివృత్తుల కళాకారులు, స్టాల్ నిర్వాహకులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ముందస్తు జాగ్రత్త చర్య చేపట్టారు. అర్న‌బ్ తుపాను ప‌రిస్థితుల‌ను పరిగణనలోకి తీసుకుని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జిల్లా కలెక్టర్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD)తో సంప్రదింపుల అనంతరం ఈ నెల 28న స‌ర‌స్ మేళాకు ప్రజల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. అనంత‌రం ఈ మేళా వాతావరణ పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలకు అనుగుణంగా ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు కొనసాగుతుంది. ప్రజలు, సందర్శకులు, మేళాలో పాల్గొంటున్నవారు అధికారులకు సహకరించాలని, విపత్తుల నిర్వహణ సంస్థ, సంబంధిత శాఖలు జారీచేసే అధికారిక సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తాత్కాలిక మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.