Breaking News

సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు ఘటన.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం

-సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు చాలా దురదృష్టకరం
-యాజమాన్యం, ప్రభుత్వం నుంచి క్షతగాత్రులకు తక్షణ సాయం
-నష్టపరిహారంపై త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటన
– వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవల శాఖ మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటన బాధితులను రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. సోమవారం విజయవాడలోని మణిపాల్ (8 మంది), ఆంధ్రా ఆస్పత్రుల్లో (8 మంది) చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారని తెలిపారు.

మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం..
మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు వెల్లడించారు. బాధితుల కుటుంబసభ్యులకు ప్రమాద సమాచారం పంపించడం జరిగిందన్నారు. క్షతగాత్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి పథకాలను కార్మికులకు సదరు సిమెంట్ ఫ్యాక్టరీ వర్తింపజేస్తున్నదీ లేనిదీ విచారించి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులకు యాజమాన్యం, ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నష్టపరిహారంపై త్వరలోనే ప్రకటన..
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందని, మృతుడు ఆవుల వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. గాయపడినవారిలో స్వామి, అర్జునరావు, గోపీనాయక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. పేలుడు ధాటికి సైదా అనే వ్యక్తికి గొంతు వద్ద బలమైన గాయం జరిగిందని, మరో క్షతగాత్రుడు శివనారాయణ కంటిచూపు 95 శాతం దెబ్బతిందని వెల్లడించారు. బాధితులందరికీ నష్టపరిహారంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఫ్యాక్టరీ పేలుడు ఘటన బాధితులను పరామర్శించి మాట్లాడుతూ.. ప్రభుత్వం వారిని అన్నివిధాల ఆదుకుంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కార్మికశాఖ కమిషనర్ ఎం.శేషగిరిబాబు, విజయవాడ ఆర్డీవో బి.హెచ్. భవానీ శంకర్, డీఎంహెచ్‌వో ఎం. సుహాసిని, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *