-సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని TTD EOకి ఆదేశం
-శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు:- సిఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థ సారధితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.