Breaking News

ప‌రిశ్ర‌మ‌ల్లో పూర్తిస్థాయి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందే

– ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు
– ప్ర‌త్యేక క‌మిటీతో ప‌రిశ్ర‌మల్లో త‌నిఖీల నిర్వ‌హ‌ణ
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌రిశ్ర‌మ‌ల్లో కార్మికుల భ‌ద్ర‌త‌, కాలుష్య నియంత్ర‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ త‌దిత‌రాల‌కు సంబంధించి నియ‌మ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని.. ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న స్ప‌ష్టం చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదం నేప‌థ్యంలో సోమ‌వారం క‌లెక్ట‌ర్ సృజ‌న‌… క‌లెక్ట‌రేట్‌లోని ఛాంబ‌ర్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌తో క‌లిసి ప‌రిశ్ర‌మ‌లు, క‌ర్మాగారాలు, కాలుష్య నియంత్ర‌ణ‌, విప‌త్తుల నిర్వ‌హ‌ణ, కార్మిక త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప‌రిశ్ర‌మ‌ల్లో అత్యున్న‌త భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ ప‌నిప్ర‌దేశాల‌ను అత్యంత సుర‌క్షితంగా ఉండేలా చూడాల‌ని.. చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం పెను విప‌త్తుకు దారితీయొచ్చ‌నే విష‌యాన్ని గుర్తించి ప‌రిశ్ర‌మ‌లు చ‌ట్ట‌ప‌ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించేలా ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు. హానిక‌ర ర‌సాయ‌నాల నిల్వ‌, వినియోగం త‌దిత‌ర కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు ప్ర‌మాదాల‌కు ఆస్కార‌మున్న ప‌రిశ్ర‌మ‌ల‌కు త‌క్ష‌ణం నోటీసులు జారీచేయాల‌ని.. నాలుగు రోజుల్లో నిర్వ‌హ‌ణ ప‌రంగా నిపుణుల‌తో అంత‌ర్గ‌త త‌నిఖీలు చేయించుకొని.. నిర్వ‌హ‌ణ‌, భ‌ద్ర‌త ప‌రంగా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అందించేలా ఆదేశాలివ్వాల‌న్నారు. అనంత‌రం జిల్లాస్థాయి ప్ర‌త్యేక క‌మిటీ ద‌శ‌ల వారీగా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ త‌నిఖీలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. కార్మికుల భ‌ద్ర‌త‌తో పాటు సంక్షేమానికి సంబంధించి అన్ని నిబంధ‌న‌ల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల్సిందేన‌ని.. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న స్ప‌ష్టం చేశారు. సమావేశంలో జీఎం డీఐసీ ఎ.సుధాక‌ర్‌, పీసీబీ ఈఈ పి.శ్రీనివాస‌రావు, ఫ్యాక్ట‌రీల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎం.శివ‌కుమార్ రెడ్డి, ఉప కార్మిక క‌మిష‌న‌ర్ సీహెచ్ ఆశారాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *