Breaking News

ఆత్మీయ ప‌ల‌క‌రింపుతో ఎన్‌టీఆర్ భ‌రోసా

-పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న
-క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌, శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ‌మోహ‌న్‌
-ఓ మంచి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్న క‌లెక్ట‌ర్‌
-పేద‌ల‌ప‌ట్ల నిజ‌మైన ప్రేమ‌తో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందన్న శాస‌న‌స‌భ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ల‌బ్ధిదారుల‌ను ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తూ వారి ఇళ్ల‌వద్ద‌కే వెళ్లి ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల మొత్తాన్ని అందించే కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ‌మోహ‌న్.. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి పాల్గొన్నారు. విజ‌య‌వాడ య‌న‌మ‌ల‌కుదురు రోడ్డు, కృష్ణాన‌గ‌ర్‌లో గురువారం జ‌రిగిన పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములై ల‌బ్ధిదారుల‌ను స్వ‌యంగా క‌లిసి పెన్ష‌న్ మొత్తాన్ని అందించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి త‌ర‌ఫున క్షేమ‌స‌మాచారాన్ని తెలుసుకొని ఎస్‌.ఆశీర్వాదం, ర‌జియాబేగం, పి.మేరీల‌కు వృద్దాప్య పెన్ష‌న్ మొత్తం రూ. 4 వేలు చొప్పున అందించారు. అదేవిధంగా డ‌యాల‌సిస్ చేయించుకుంటున్న నాగ‌వ‌ర‌పు బాలాజీకి రూ. 10 వేల పెన్ష‌న్ మొత్తాన్ని అందించారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్ధిదారులు గౌర‌వ ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న మాట్లాడుతూ జిల్లాలో 2,34,143 మంది పెన్ష‌న్‌దారుల‌కు దాదాపు రూ. 99 కోట్ల మేర అందించ‌డానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళికాయుతంగా ఏర్పాట్లు చేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన‌ట్లు తెలిపారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు, ఇత‌ర ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ‌కు మ్యాప్ చేసిన ల‌బ్ధిదారుల ఇళ్లవ‌ద్ద‌కే వెళ్లి పెన్ష‌న్ మొత్తం అందించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పెద్ద ఎత్తున భాగ‌స్వాముల‌య్యార‌ని.. ఇంత‌మంచి కార్య‌క్ర‌మంలో తానూ పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న పేర్కొన్నారు.

పేద‌ల క్షేమం, సంక్షేమంపై చిత్త‌శుద్ధి: ఎమ్మెల్యే గ‌ద్దె రామ‌మోహ‌న్‌
పేద‌లు ఇబ్బందిప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప్ర‌ణాళికాయుతంగా ఏర్పాట్లు చేసి ల‌బ్ధిదారుల‌కు ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల మొత్తాన్ని అందించిన‌ట్లు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ‌మోహ‌న్ అన్నారు. పేద‌ల క్షేమాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారిపై నిజ‌మైన ప్రేమ‌తో, చిత్త‌శుద్ధితో ప్ర‌భుత్వం సేవ‌లందిస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తోనే ఇళ్ల వ‌ద్ద‌నే పెన్ష‌న్ల మొత్తాన్ని అందించ‌డం జ‌రుగుతోంద‌ని.. గ‌తంలో సాధ్యం కాద‌న్న దాన్ని సుసాధ్యం చేసి చూపామ‌న్నారు. కొత్తగా అర్హులు ఎవ‌రైనా ఉంటే వారిని కూడా గుర్తించి పెన్ష‌న్లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అదే విధంగా గ‌తంలో వివిధ కార‌ణాల వ‌ల్ల పెన్ష‌న్లు నిలిచిపోయిన వారి జాబితాను మ‌ళ్లీ స‌మీక్షించి.. అర్హ‌త ఉన్న‌వారికి కూడా ల‌బ్ధి చేకూర్చ‌నున్న‌ట్లు తెలిపారు. పెన్ష‌న్ మొత్తాన్ని పెంచి పేద‌ల‌కు అందిస్తున్న గౌర‌వ ముఖ్య‌మంత్రికి ల‌బ్ధిదారుల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు ఎమ్మెల్యే గ‌ద్దె రామ‌మోహ‌న్ తెలిపారు.
కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, స్థానిక కార్పొరేట‌ర్ ఎం.ప్ర‌సాద్, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *