Breaking News

గిరిజ‌న గ్రామ పంచాయ‌తీల స‌మావేశాల్లో సికిల్ సెల్ ఎనీమియాపై చ‌ర్చించాలి

-ఇందుకోసం గిరిజ‌న సంక్షేమ శాఖ ఉన్న‌తాధికారుల్నిసంప్ర‌దించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలి
-సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్‌ను నిరంత‌ర‌మూ చేప‌ట్టాలి
-2047 నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించాల‌న్న‌దే లక్ష్యం
-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజ‌న ప్రాంతాల్లో సికిల్‌సెల్ ఎనీమియా నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ మరియు ఎండీ నేషనల్ హెల్త్ మిషన్ సి.హరికిర‌ణ్ ( COMMISSIONER OF HEALTH AND FAMILY WELFARE & MD, NHM C.HARIKIRAN IAS )ఆదేశించారు. గిరిజ‌న గ్రామ పంచాయ‌తీల స‌మావేశం అజెండాలో సికిల్ సెల్ ఎనీమియా అంశం కూడా చేర్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గిరిజ‌న గ్రామ‌పంచాయ‌తీల్లో దీనిపై చ‌ర్చిస్తే ఈ కార్య‌క్ర‌మం మ‌రింత వేగ‌వంత‌మ‌వుతుంద‌న్నారు. ఇందుకోసం గిరిజ‌న సంక్షేమ శాఖ ఉన్న‌తాధికారుల్ని సంప్ర‌దించాల‌న్నారు. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూల‌న మిష‌న్ (NATIONAL SICKLE CELL ANEMIA ELIMINATION MISSON )పై మంగ‌ళ‌గిరి ఎపిఐఐసి ట‌వ‌ర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో గురువారం ఆయ‌న స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌మీష‌న‌ర్ హ‌రికిర‌ణ్ మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌నుగుణంగా సికిల్ సెల్ ఎనీమియా బాధితుల్ని స్క్రీనింగ్ చేయాల‌ని, ఈ ప్ర‌క్రియను నిరంత‌రం కొన‌సాగేలే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆదేశించారు. సంబంధిత ఐటిడిఎ పీవోల‌తో దీనిపై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తామ‌న్నారు. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూల‌న కార్య‌క్ర‌మాన్ని ఛాలెంజ్ గా తీసుకుని సంతృప్త స్థాయికి ( SATURATION LEVEL )తీసుకెళ్లాల‌ని, ఇందుకోసం వినూత్న విధానాల్ని అవ‌లింబించాల‌ని సూచించారు. సోమ‌వారం జ‌రిగే రాష్ట్ర‌స్థాయి జిల్లా క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో సికిల్ సెల్ ఎనీమియా అంశంపై మాట్లాడ‌తాన‌న్నారు. సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల (SUSTAINABLE DEVELOPMENT GOALS ) సాధ‌న‌ దిశ‌గా దీనిపై మ‌రింత దృష్టిని సారించాల‌న్నారు. 2023 జులైలో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూల‌న మిష‌న్ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించార‌ని, 2047 నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని తెలిపారు. గిరిజ‌న ప్రాంతాల్లో జీరో నుండి 40 ఏళ్ల మ‌ధ్య వయ‌సుగ‌ల 19,90,277 బాధితుల్ని మూడేళ్ల‌లో ఏపీలో స్క్రీనింగ్ చేయాల‌ని కేంద్రం ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించింద‌ని ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 8,80,560 మందికి స్క్రీనింగ్ చేశార‌ని, ఇందులో 19,046 మంది సికిల్ సెల్ ఎనీమియా క్యారియ‌ర్లు కాగా, 1684 మందికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉన్న‌ట్లు తేలింద‌న్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం స్క్రీనింగ్ చేసిన ప్ర‌తి వ్య‌క్తికీ సికిల్ సెల్ స్టేట‌స్ ఐడి కార్డును జారీ చేస్తార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 2,85,397 మందికి ఈ కార్డుల్ని జారీ చేశార‌న్నారు. మ‌రో 1,39,888 కార్డుల్ని త్వ‌ర‌లో జారీ చేస్తార‌న్నారు. సికిల్ సెల్ ఎనీమియా బాధితుల‌కు ఉచితంగా ర‌క్తాన్ని అందిస్తార‌న్నారు. రాష్ట్రంలో 2016 నుండి అమ‌ల‌వుతున్న ప్ర‌ధాన మంత్రి జాతీయ డ‌యాల‌సిస్ కార్య‌క్ర‌మంపై కూడా ఆయ‌న ఆరా తీశారు. ఈ కార్య‌క్ర‌మం కింద ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో 49 డ‌యాల‌సిస్ సెంట‌ర్లున్నాయ‌ని, మ‌రో 9 డ‌యాల‌సిస్ సెంట‌ర్లను నెల‌కొల్పేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సికిల్ సెల్ ఎనీమియా పీవో డాక్ట‌ర్ న‌రేష్‌ కుమార్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

స్కానింగ్‌కు వ‌చ్చే రోగుల్ని తొంద‌ర‌గా పంపించేలా చ‌ర్య‌లు తీసుకోవాలిః క‌మీష‌న‌ర్ హ‌రికిర‌ణ్‌
ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కొచ్చే రోగుల‌కు ఎక్స్‌రే, సిటి స్కాన్, ఎంఆర్ ఐ వంటి స్కానింగ్ ను తొంద‌ర‌గా చేసి పంపించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌మీష‌న‌ర్ హ‌రికిర‌ణ్ సూచించారు. పేషెంట్ల ఓపీ ఐడీకి స్కానింగ్ ఐడీకీ లింక్ చేస్తే ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌వుంద‌న్నారు. నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ కింద ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ఎక్స్ రే, సిటి స్కాన్‌, ఎంఆర్ ఐ స్కాన్ ఉచిత డయగ్నోసిస్ కేంద్రాల అమ‌లుతీరుపై ఆయ‌న స‌మీక్షించారు. 156 జిల్లా, ప్రాంతీయ ప్ర‌భుత్వాసుప‌త్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత డ‌య‌గ్నాసిస్ కార్య‌క్ర‌మం అమ‌ల‌వుతోంద‌ని పీఓ డాక్ట‌ర్ న‌రేష్ కుమార్ వివ‌రించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *