Breaking News

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త…. తక్షణం 4జి సిమ్ ఉచిత సేవలు!

-గుంటూరు బిజినెస్ ఏరియా జిఎం శ్రీధర్ వెల్లడి
-కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు కృతజ్ఞతలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సిమ్ కార్డును అప్ గ్రేడ్ చేసుకుని 4జి సేవలను సద్వినియోగం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ గుంటూరు బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్. శ్రీధర్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. బిఎస్ఎన్ఎల్ దశలవారీగా పాన్ ఇండియా ఆధారంగా 4జి టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అయినప్పటికీ చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ తమ మొబైల్ సేవలను 2జి, 3జి సిమ్ లో మాత్రమే ఉపయోగిస్తున్నారన్నారు. కష్టమర్లకు వారి ప్రాంతాల్లో 4జి సేవలు ప్రారంభించినప్పుడు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. వినియోగదారులు సిమ్ ను అప్ గ్రేడ్ చేసిన తర్వాత 2జి, 3జి, 4జి సేవలను ఆస్వాదించవచ్చని చెప్పారు. 4జికి అప్ గ్రేడ్ చేసిన తర్వాత 2జి సేవలు కొనసాగుతాయని తెలిపారు. 3జి సేవలలో అంతరాయం ఏర్పడుతుందని తెలియజేసారు. 54040కి సిమ్ అనే సందేశాన్ని పంపడం ద్వారా కస్టమర్లు తమ సిమ్ రకాన్ని సులభంగా తెలుసుకోవచ్చని, అలాగే ‘నేమ్’ అని సందేశము పంపడం ద్వారా తమ పేరును సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన 4జి సిమ్ అప్ గ్రేడ్ ఆఫరును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బిఎస్ఎన్ఎల్ 4జి సేవల విస్తరణ పట్ల టెలికామ్ సలహా కమిటీ మాజీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావు హర్షం వ్యక్తం చేశారు. గడచిన మూడేళ్ల కాలంలో తమ కమిటీ హయాంలో పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కమిటీ చైర్మన్ హోదాలో ఈ విషయమై లోక్ సభలో ప్రస్తావించారని, ఆపై ప్రధాని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారని ఆయన తెలిపారు. బిఎస్ఎన్ఎల్ 4జి సేవల వల్ల ముఖ్యంగా వెనుకబడిన పల్నాడు ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు ఎంపీ, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకృష్ణదేవరాయలుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *